ఏపీలో వైద్యుల సూట్ల తయారీ ముమ్మరం!

Update: 2020-04-08 11:30 GMT
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న వారితో పాటు ఆ లక్షణాలతో ఉన్న అనుమానితులకు సత్వరమే వైద్య సహాయం అందిస్తున్నారు. కరోనా వైరస్‌ కట్టడికి.. ఆ వ్యాధి నివారణకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నిరంతరం సమీక్షిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతోపాటు వైద్యులు - వైద్య సిబ్బందికి అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారు. కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే ప్రత్యేక సూట్ల తయారీ కూడా ముమ్మరం చేసింది. ఆ సూట్లు ఆంధ్రప్రదేశ్‌ లోని తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమయ్యాయి.

వైద్యులకు పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) సూట్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా ఆ సూట్ల తయారీ ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల పీపీఈ సూట్లు సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ సూట్ల తయారీ తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న పాల్స్‌ ప్లస్‌ బొమ్మల పరిశ్రమ యాజమాన్యానికి అప్పగించింది. ఆ పరిశ్రమలో రోజుకు నాలుగు వేల సూట్లు తయారుచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వినైల్‌ క్లాత్‌ తో తయారు చేసే ఈ సూట్ల తయారీకి సంబంధించి నాలుగు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. అవసరమైన సామగ్రిని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించారు. ఈ తయారీని సోమవారం నుంచి ప్రారంభించారని సమాచారం.

తల నుంచి కాళ్ల వరకు పూర్తిగా మూసివేసి కేవలం కళ్లు మాత్రమే కనిపించేలా ఈ సూట్లు ఉంటాయి. ప్రస్తుతం పరిశ్రమలో రోజుకు రెండు వేల సూట్ల వరకు తయారయ్యేలా సౌకర్యాలు ఉన్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి వెంటనే సూట్ల తయారీ పూర్తి చేయాలని.. 2 లక్షల పీపీఈ సూట్లు సిద్ధం చేయాలని సూచించారు.


Tags:    

Similar News