అవును.. జగన్ రామోజీ ఇంటికి వెళ్లారు

Update: 2015-09-24 16:08 GMT
తెలుగు ప్రజలకు సంబంధించినంత వరకూ ఇదో పెద్ద వార్తే. ఉప్పు..నిప్పుగా ఉండే ఇద్దరు వ్యక్తులు కలవటం అంత చిన్న విషయం కాదు. ఎంతవరకైనా సరే అన్నట్లుగా వ్యవహరించిన ఇద్దరు ప్రత్యర్థులు కలుసుకొని మాట్లాడుకుంటేనే వార్త అయ్యింది. అలాంటిది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్.. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఇంటికి వెళ్లటం.. ఆయనతో కబుర్లు చెప్పటం అంటే చిన్న విషయం కాదు.

వినటానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం కావటం పలువురిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. వ్యాపార.. రాజకీయ వైరం ఉన్న వీరి మధ్య భేటీ రాజకీయంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. వైఎస్ కు.. రామోజీకి మధ్యనున్న శత్రుత్వం ఏ స్థాయి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. జగన్ హయాంలో అది ఏ స్థాయికి వెళ్లిందో చెప్పాల్సిన అవసరమే లేదు.

రామోజీరావు క్యారికేచర్లను భారీగా తన పత్రికలో అచ్చేసిన జగన్.. తనకున్న అగ్రహాన్ని వ్యక్తం చేసేవారు. అలాంటి ఆయన తాజాగా రామోజీ ఫిలింసిటీలోని ఆయన ఇంటికి వెళ్లి కలిసి రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఇది మర్యాదపూర్వకమైన భేటీగా చెబుతున్నప్పటికీ.. అంత చిన్న విషయం కాదన్న మాట వినిపిస్తోంది.

సినీ నటుడు మోహన్ బాబు కుమారుడి వివాహ సందర్భంగా ఈ ఇద్దరి మధ్య మాట కలిసినట్లుగా చెబుతారు. అంతకు ముందే.. జగన్ సతీమణి భారతి.. రామోజీ కోడలు శైలజా కిరణ్ ల మధ్య ఉన్న టచ్ తో ఈ భేటీ సాధ్యమైందని చెబుతారు. ఈనాడు సంస్థ నెలకొల్పిన 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జగన్ నుంచి ప్రత్యేక బోకే రామోజీ వద్దకు వచ్చిందని.. అలా బొకేతో మొదలైన వారి బంధం ఈ రోజు నేరుగా జగనే.. రామోజీ ఇంటికి వచ్చి మాట్లాడే వరకూ వెళ్లిందన్న మాట వినిపిస్తోంది.

రాజకీయాల్లోనూ.. వ్యాపారాల్లోనూ శాశ్విత వైరం.. శాశ్విత మైత్రి అన్నది ఉండదన్న విషయం తాజా ఉదంతంతో మరోసారి రుజువైందని చెబుతారు. రామోజీ రావు వరకూ చూస్తే.. ఈ భేటీతో ఆయన ఎంత పవర్ ఫుల్ అన్నది మరోసారి స్పష్టమైతే.. జగన్ కోణంలో చూస్తే.. ఆయన మీదున్న అహంభావం ముద్ర తాజా చర్యతో చెరిపేసుకోవటానికి అవకాశం ఇస్తుందని చెప్పొచ్చు. రాజకీయంగా ప్రభావితం చేసే ఈ సమావేశం రానున్న రోజుల్లో ఎంతవరకూ వెళుతుందో చూడాలి.
Tags:    

Similar News