'బటన్' ప్రచారం.. అది జగన్ కు మాత్రమే సాధ్యం బాస్

Update: 2022-12-28 17:30 GMT
ప్రభుత్వం ఏదైనా కావొచ్చు. ఒక సంక్షేమ పథకాన్ని ఒక ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది? తాము చేపట్టే సంక్షేమ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించి.. ఫలానా తేదీ నుంచి తాము చేపట్టే పథకం కారణంగా ఇంత భారీగా ప్రయోజనం ఉంటుందని చెప్పుకోవటం.. దానికి సంబంధించిన ప్రచారాన్ని భారీగా చేసుకోవటం మామూలే. ఇది ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు.. ప్రభుత్వాధినేతలు చేసేది. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూటే సపరేటు. ఆయన తీరు మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నం.

తాను చేసే ప్రతి రూపాయి పది రూపాయిల ప్రచారం తప్పనిసరి అన్న విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత పక్కాగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రభుత్వం తాను చేపట్టే సంక్షేమ పథకాల విషయాల్లో ఎప్పటికప్పుడు మైలేజీకి అనుగుణంగా అడుగులు వేయటం చాలా అరుదుగా చూస్తుంటాం. ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలకు అవసరమైన సొమ్ములు మొత్తాన్ని ప్రజల నుంచి పన్నుల రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తుంటారు.

అలా తాము వసూలు చేసే పన్ను ఆదాయాన్ని.. కొన్ని లక్షిత వర్గాలకు పథకాల రూపంలో అందజేస్తుంటారు. జగన్ ప్రభుత్వం చేసే ఏ సంక్షేమ కార్యక్రమైనా ఇలానే ఉంటుంది. అలా అని జగన్ ప్రభుత్వం మాత్రమే కాదు. ఏ సర్కారు అయినా తాము అమలు చేసే పథకాలకు అవసరమైన నిధులు.. ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను ఆదాయం నుంచన్నది మర్చిపోకూడదు.

అలా ప్రజలు నుంచి వసూలు చేసిన సొమ్ములను ప్రభుత్వ పథకాలుగా అమలు చేసే క్రమంలో బటన్ నొక్కే కార్యక్రమం ఒకటి పెట్టి.. దానికి విశేష ఆధరణ కలిగేలా చేసే విషయంలో జగన్ మిగిలిన ముఖ్యమంత్రులకు కొత్త స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పాలి.

ఒకసారి ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేస్తుంటే.. సదరు పథకానికి సంబంధించిన ప్రచారం ఒకసారో.. రెండో సార్లుచేసుకుంటారు. కానీ.. సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నం. ప్రతి పథకాన్ని నాలుగు భాగాలుగా చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆయన బటన్ నొక్కేయటం ద్వారా.. నిధులను లబ్థిదారుల ఖాతాలోకి వెళ్లేలా తాను చేస్తున్నాన్న భావన కలిగేలా చేస్తారు. తాను నొక్కే బటన్ తో ప్రజల బతుకులు మారిపోతాయన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది.

నిజానికి.. రోటీన్ గా జరిగే ప్రాసెస్ కు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా బటన్ నొక్కటం.. ఆ వెంటనే వందలాది కోట్లు ఆన్ లైన్ ద్వారా లబ్థిదారులకు చేరుతుందన్న భావన కలిగేలా చేయటంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పాలి. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. ఆయన మాత్రం బటన్ నొక్కుడు ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకోవటమే కాదు.. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బటన్ నొక్కుడు పద్దతిని పరిచయం చేస్తున్నారని చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News