ప్రత్యేక హోదా అంటే చంద్రబాబుకు జైలేనట

Update: 2015-10-07 11:05 GMT
ప్రత్యేక హోదా దీక్షలో వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హక్కు అని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ ఈ రోజు గుంటూరు శివారుల్లోని నల్లపాడులో నిరవధిక దీక్ష ప్రారంభించారు. దీక్ష ప్రారంభించిన జగన్ మాట్లాడుతూ...రాష్ట్రాన్ని విభజించ వద్దంటూ గట్టిగా నిలబడిన పార్టీ వైకాపా మాత్రమేనని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు నోరెత్తని కొందరు నేతలు ఇప్పడు డ్రామాలాడుతున్నారంటూ టీడీపీపై విమర్శలు కురిపించారు.  చంద్రబాబుపై నేరుగా విమర్శలు గుప్పిస్తూ... ఓటుకు నోటు కేసులో ఆయన అడ్డంగా బుక్కవడం వల్లే దాన్నుంచి బయటపడడానికి కేంద్రం సహాయం తీసుకుని.. ప్రత్యేక హోదా విషయంలో రాజీపడిపోయారని... ఆయన ప్రత్యేక హోదాపై ప్రధానిపై ఒత్తిడి తెస్తే 24 గంటల్లోనే జైళ్లో పెడతారని అన్నారు.

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ప్రత్యేక్ హోదా వచ్చి తీరాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడని, తాను కాంగ్రెస్ పార్టీ వీడగానే ఆ పార్టీకి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా శత్రువుగా మారిపోయారని జగన్ విమర్శించారు.

ఏపీకి ప్రత్యేక హోదాకు పక్క రాష్ట్రాలు అంగీకరించడం లేదని చెప్పడం పూర్తిగా అబద్ధమని జగన్ అన్నారు. ప్రధాని నిర్ణయం తీసుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ఆ విషయంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ వైకాపా పోరాడుతుందని జగన్ స్పష్టం చేశారు.

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఆయన తెలంగాణలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టారన్నారు. రాజకీయ నాయకుల పైన కేసులు కొత్తేం కాదన్నారు. ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్న సోనియా గాంధీతో కుమ్మక్కై.. నాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని రక్షించి.. తనపైన కేసులు పెట్టారని ఆరోపించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక.. సోనియాతో కుమ్మక్కై, చీకట్లో చిదంబరాన్ని కలిసి నా పైన కేసులు పెట్టారన్నారు.

హోదా ఇచ్చేందుకు తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా ఒప్పుకోవడం లేదని ఇప్పుడు చెప్పడం విడ్డూరమన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో ఆ రాష్ట్రాలు వద్దనలేదని కారణం చెప్పలేదు కదా అన్నారు. ప్రత్యేక హోదా అంశం ప్రణాళికా సంఘం పరిధిలో ఉండదన్నారు. ఎన్డీసీ, కేంద్ర కేబినెట్ పరిధిలో ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు. ప్రధాని నిర్ణయం తీసుకుంటే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చెప్పాలన్నారు. హోదా కోసం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ధైర్యం లేదని... ఒత్తిడి తెస్తే ఆయన 24 గంటల్లో ఓటుకు నోటుకు కేసులో జైలుకు వెళ్తారనే భయం ఉందన్నారు.
Tags:    

Similar News