వైఎస్ జ‌గ‌న్‌!... సెంట్ర‌ల్‌లో కింగ్ మేక‌ర్!

Update: 2019-01-07 01:30 GMT
త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఏ కూట‌మి వైపు ఉన్నార‌న్న అంశాన్ని నిగ్గు తేల్చేందుకు చాలా సంస్ధ‌లు ఇప్పుడు తీవ్ర క‌స‌ర‌త్తే చేస్తున్నాయి. ఈ క‌స‌ర‌త్తులో భాగంగా ఎప్ప‌టిక‌ప్పుడు తాము చేసిన స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తున్న ఆయా సంస్థ‌లు... ఆయా పార్టీల‌కు ప్ర‌జ‌ల నుంచి ఏ మేర‌కు మ‌ద్ద‌తు ఉంది? ఏఏ పార్టీలు ఎన్నెన్ని సీట్లు ద‌క్కించుకుంటాయి? అంతిమంగా కేంద్రంలో అధికార పీఠం ఎక్కేది ఎవ‌రు? మ‌ళ్లీ మోదీ వ‌స్తారా?  రాహుల్ గాంధీ బ‌లం ఏ మేర‌కు పెరిగింది? అన్న స‌మ‌గ్ర వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ జ‌నాల‌కు మాత్రం ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగానే నిన్న టీవీ-సీఎన్ఎక్స్ అనే సంస్థ ఇలాంటి ఓ స‌ర్వేను విడుద‌ల చేసింది. ఈ స‌ర్వేలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మికే ఎడ్జ్ ల‌భిస్తుంద‌ని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని యూపీఏ కూట‌మి మ‌రోమారు ప్ర‌తిప‌క్ష పాత్ర‌నే పోషించాల్సి ఉంటుంద‌ని సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓ మూడు రాష్ట్రాల్లో బీజేపీని చిత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ... ఆ మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్న ద‌రిమిలా... దేశ‌వ్యాప్తంగా త‌మ బ‌లం బాగానే పెరిగిపోయింద‌ని అంచ‌నాలు వేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఈ స‌ర్వే పెద్ద షాకేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అదే స‌మ‌యంలో వ‌చ్చే సారి కూడా త‌మ‌దే అధికారం అని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్న క‌మ‌ల‌నాథుల‌కు కూడా ఈ స‌ర్వే ఓ ఝ‌ల‌క్ ఇచ్చింద‌నే చెప్పాలి. ఎందుకంటే... ఇప్ప‌టికిప్పుడు లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌రిగితే... 543 స్థానాల‌కు గానూ... ఎన్డీఏ కూట‌మికి 257 సీట్లు వ‌స్తాయ‌ని చెప్పిన ఈ స‌ర్వే... మెజారిటీ మ్యాజిక్ ఫిగ‌ర్‌కు ఎన్డీఏ కూట‌మి ఇంకో 15 సీట్ల దూరంలో నిలుస్తుంద‌ని చెప్పింది. అంతేకాకుండా కాంగ్రెస్ కూట‌మికి కూడా ఓ మోస్త‌రుగా 146 సీట్లు వ‌స్తాయ‌ని కూడా ఆ స‌ర్వే చెప్పింది. మ‌రి మెజారిటీకి 15 సీట్లు త‌క్కువ‌గా వ‌స్తే... ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేదెలా?  ఈ ప్ర‌శ్న‌కు కూడా ఈ స‌ర్వే ఆన్స‌ర్ కూడా ఇచ్చేసింది. అటు ఎన్డీఏ కూట‌మితో, ఇటు యూపీఏ కూట‌మితో సంబంధం లేకుండా ఉన్న పార్టీలు చాలానే ఉన్నాయ‌ని, ఆ పార్టీల‌న్నింటికీ క‌లిపి ఏకంగా 140 సీట్లు ద‌క్క‌నున్నాయ‌ని కూడా ఆ సర్వే చెప్పింది. మెజారిటీకి కాస్తంత దూరంలో నిలిచే ఎన్డీఏ అయినా... మెజారిటీకి చాలా దూరంలో నిలిచే యూపీఏ అయినా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే... ఈ త‌ట‌స్థ పార్టీల మద్ద‌తు త‌ప్ప‌నిస‌రి.

మ‌రి ఈ జాబితాలో ఏఏ పార్టీలు ఉన్నాయి?  వాటికి ఎన్నెన్ని సీట్లు వ‌స్తాయ‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన ఈ స‌ర్వే... జాబితాలో స‌మాజ్ వాదీ పార్టీ, బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ, అన్నాడీఎంకే, తృణ‌మూల్ కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, బిజూ జ‌న‌తాద‌ళ్‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, పీడీపీ, ఏఐయూడీఎఫ్‌, మ‌జ్లిస్‌, ఐఎన్ఎల్‌డీ, ఆమ్ ఆద్మీ పార్టీ, జేవీఎం, త‌మిళ‌నాడుకు చెందిన ఏఎంఎంకే త‌దిత‌ర పార్టీలున్నాయి. వీటిలో తృణ‌మూల్ కాంగ్రెస్‌కు 26 సీట్లు రానుండ‌గా, ఆ త‌ర్వాత స్థానంలో అత్య‌ధిక స్థానాలు ద‌క్కించుకునే పార్టీల జాబితాలో స‌మాజ్ వాదీ పార్టీ (20 సీట్లు) - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (19 సీట్లు) - టీఆర్ఎస్ (16 సీట్లు) - బీఎస్పీ (15 సీట్లు) - బిజూ జ‌న‌తాద‌ళ్ (13 సీట్లు) - అన్నాడీఎంకే (10 సీట్లు) ఉన్నాయి. మిగిలిన పార్టీల‌కు ప‌ది కంటే త‌క్కువ స్థానాలు రానున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌ది కంటే త‌క్కువ స్థానాలు వ‌చ్చే పార్టీల‌ను ప‌క్క‌న‌పెడితే... తొలి నాలుగు స్థానాల్లో ఉన్న పార్టీలు కేంద్రంలో కింగ్ మేక‌ర్ పాత్ర పోషించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

ఈ క్ర‌మంలో ఫ‌స్ట్ పొజిష‌న్ లో ఉన్న తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఏ కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లికినా... చాంతాడంత డిమాండ్ల‌ను ముందు పెట్టే అవ‌కాశాలే ఎక్కువ‌. అంతేకాక అవ‌కాశం ఉంటే... ఏకంగా పీఎం ప‌ద‌వినే డిమాండ్ చేసేందుకు తృణ‌మూల్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఏమాత్రం సంకోచించ‌రు. ఇక 20 సీట్ల‌తో రెండో స్థానంలో ఉన్న స‌మాజ్ వాదీ పార్టీ ప‌రిస్థితి కూడా ఇందుకు భిన్న‌మేమీ కాదు. ములాయం ఇప్ప‌టికే జాతీయ రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఎప్ప‌టినుంచో క‌ల‌లు కంటున్నారాయే. ఇక ఆ త‌ర్వాత ఉన్న పార్టీ... ఏపీలో బ‌ల‌మైన విప‌క్షంగా ఉన్న వైసీపీనే. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని పేప‌ర్‌పై రాసిచ్చే ఏ కూట‌మికి అయినా భేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌ని ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో అటు బీజేపీ అయినా, ఇటు కాంగ్రెస్ అయినా... ఎలాంటి పెద్ద డిమాండ్ల జాబితా లేకుండా భేష‌ర‌తు మ‌ద్ద‌తు పొంద‌గ‌లిగేది ఒక్క వైసీపీ నుంచే. ఈ కారణంగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్ప‌గ‌లిగే అవ‌కాశాలున్న పార్టీ ఒక్క వైసీపీనే. అంటే... ఇప్ప‌టికే జాతీయ రాజ‌కీయాల‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు గుప్పించిన చంద్ర‌బాబు, కేసీఆర్‌ల కంటే జ‌గ‌న్‌కే చ‌క్రం తిప్పే అవ‌కాశాలు ఎక్కువన్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.
Tags:    

Similar News