బాబు కాల‌ర్ ప‌ట్టుకుంటానన్న జ‌గ‌న్‌

Update: 2016-09-10 18:00 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ర్షాకాల స‌మావేశాలు ముగిసిన సంద‌ర్భంగా, ఏపీలో చేప‌ట్టిన బంద్‌ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో సొంత ప్ర‌యోజ‌నాల కోసం బాబు లాలూచీ ప‌డి త‌ద్వారా రాష్ట్ర అభివృద్ధిని తాక‌ట్టు పెట్టార‌ని వైఎస్ జ‌గ‌న్ మండిప‌డ్డారు. సభలో బల్లలు ఎక్కార‌ని త‌మ‌పై టీడీపీ నాయ‌కులు మండిప‌డుతున్నార‌ని చెప్పిన జ‌గ‌న్ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం బ‌ల్లలు ఎక్కడమే కాదు... అవ‌స‌ర‌మైతే చంద్రబాబు కాలర్‌ పట్టుకుంటామని ఆగ్ర‌హంతో వ్యాఖ్యానించారు.

స‌భ వాయిదా ప‌డిన అనంత‌రం అసెంబ్లీ లోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన జ‌గ‌న్‌...కేసుల నుంచి బయటపడేందుకే ప్రత్యేక హోదాకు చంద్ర‌బాబు మంగళం పాడుతున్నారని ఆరోపించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌ట‌న చేస్తే అర్ద‌రాత్రి ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ సంతోషం వ్య‌క్తం చేయ‌డమే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డ్డారు. ప్ర‌త్యేక హోదా గురించి శాసనమండలిలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని జ‌గ‌న్ అన్నారు. హోదా కోసం పోరాడాల్సిన వ్యక్తి త‌న‌కు హోదా గురించిన ప్రయోజనాలు వివ‌రించాల‌ని స‌భా ముఖంగా అడ‌గ‌టం అంటే ఏర‌కంగా ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చ‌ని జ‌గ‌న్‌ చెప్పారు.  తాము అధికారంలోకి వస్తే 15 ఏళ్లు హోదా తెస్తామని చెప్పి, ఎన్నికలు అయిపోయాక మాట మారుస్తూ హోదా వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయ‌ని అడ‌గ‌టం చూస్తుంటే... ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్ట‌డం, అబ‌ద్దాలు చెప్ప‌డంలో ఆరితేరిన బాబు తీరు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని జ‌గ‌న్ ఫైర్ అయ్యారు.

ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన ప్ర‌త్యేక హోదా కోసం తాము బంద్ రూపంలో నిర‌స‌న వ్య‌క్తం చేస్తుంటే..చంద్ర‌బాబు దాన్ని అణిచివేసేందుకు కుట్ర‌లు ప‌న్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా అందులో పాల్గొన్నార‌ని చెప్పారు. అలా సీమాంధ్రుల ఆకాంక్ష‌ల‌ను చాటిన వారికి పేరుపేరున కృత‌జ్ఞ‌త‌లు చెప్తున్న‌ట్లు జ‌గ‌న్ పేర్కొన్నారు. తెలంగాణ సాధన స్ఫూర్తితో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తెలిపారు. ప్రత్యేక హోదా పోరాటం ఇంతటితో ఆగదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలపై గట్టిగా పోరాడుతామని, పాలకుల్లో మార్పు వచ్చేదాకా పోరాటం చేస్తామన్నారు.
Tags:    

Similar News