200 రోజుల పాద‌యాత్ర వేళ‌..జ‌గ‌న్ ట్వీట్‌

Update: 2018-06-27 05:57 GMT
కొత్త ఆశయంతో అడుగు వేసే ఎవ‌రికైనా ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌ని.. వారి ఈతి బాధ‌ల్ని త‌ప్పించాల‌న్న ధృఢ సంక‌ల్పంతో సుదీర్ఘ పాద‌యాత్ర‌కు న‌డుం బిగించిన ఏపీ విప‌క్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 200 రోజుల‌కు చేరింది. ప్ర‌తికూల వాతావ‌ర‌ణానికి వెర‌వ‌క‌.. అధికార‌ప‌క్షం పెట్టే రాజ‌కీయ ఇబ్బందుల్ని త‌ట్టుకుంటూ మొక్కోవోని దీక్ష‌తో ముందడుగు వేయ‌ట‌మే త‌ప్పించి.. వెన‌క్కి త‌గ్గ‌కుండా వెళుతున్న జ‌గ‌న్ పాద‌యాత్ర‌ నిర్విరామంగా సాగుతోంది.

పాద‌యాత్ర సంద‌ర్భంగా ప‌లుమార్లు జ‌గ‌న్ ఆరోగ్య స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ  వెన‌క్కి త‌గ్గ‌ని ఆయ‌న పాద‌యాత్రను కొన‌సాగించారు. వ‌ణికే చ‌లితో మొద‌లెట్టి.. మండే ఎండ‌ను లెక్క చేయ‌కుండా సాగుతున్న జ‌గ‌న్ క‌ష్టానికి ఏపీ ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌డుతున్నారు. ఆయ‌న ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంత ప్ర‌జ‌లు భారీగా పోటెత్తుతున్నారు. ఆయ‌న వెంట సాగుతున్న జ‌న‌ వాహిని చూసి ఏపీ అధికార‌ప‌క్షం గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్న ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర స్టార్ట్ చేసి 200 రోజుల మైలురాయికి చేరుకున్న సంద‌ర్భంగా జ‌గ‌న్ ట్వీట్ చేశారు. దివంగ‌త మ‌హానేత వైఎస్ పాల‌న‌ను ఏపీలో తిరిగి తీసుకొచ్చి ప్ర‌జ‌ల ముఖాల్లో చిరున‌వ్వులు చూడ‌ట‌మే త‌న సంక‌ల్పంగా స్ప‌ష్టం చేసిన జ‌గ‌న్‌.. నాలుగేళ్లుగా బాబు పాల‌న‌ను ఎండ‌గ‌డుతున్నారు. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్ని తెలుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాద‌యాత్ర 200 రోజుల‌కు చేరుకొంది.ఆయ‌నిప్పుడు అమ‌లాపురంలో పాద‌యాత్ర‌ను నిర్వ‌హిస్తున్నారు. త‌న పాద‌యాత్ర‌లో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కూ వైఎస్ జ‌గ‌న్ 2,434.2 కిలోమీట‌ర్లు  న‌డిచారు. రాజ‌న్న రాజ్యాన్ని తిరిగి ఏపీలోకి తేవ‌ట‌మే త‌న సంక‌ల్ప‌మ‌ని.. అలా చేసి ప్ర‌జ‌ల ముఖాల్లో చిరున‌వ్వులు చూడ‌ట‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని తాజా ట్వీట్ లో పేర్కొన్నారు.
Tags:    

Similar News