త్వ‌ర‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర‌

Update: 2017-07-07 07:06 GMT
వైసీపీ అధినేత జ‌గ‌న్ భారీ పాద‌యాత్ర‌కు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా వైసీపీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. అచ్చంగా త‌న తండ్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డి మాదిరిగానే  ప్ర‌జాప్ర‌స్థానం పేరిట పాద యాత్ర చేస్తార‌ని తెలుస్తోంది. ఈ యాత్ర ఇడుపుల పాయ నుంచి  ఇచ్ఛాపురం వ‌ర‌కు సాగుతుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కోర్ టీం దీనికి సంబంధించి విధివిధానాలు ఖ‌రారు చేసే ప‌నిలో ఉన్న‌ట్లు స‌మాచారం.

నిజానికి దీనికి సంబంధించి రేప‌టి నుంచి గుంటూరులో నిర్వ‌హించ‌బోయే పార్టీ ప్లీన‌రీలో ప్ర‌క‌ట‌న చేయాల‌ని అనుకున్నార‌ని.. కానీ, ప్ర‌స్తుతానికి విధివిధానాల ఖ‌రారు కాక‌పోవ‌డంతో ప్ర‌క‌ట‌న వాయిదా వేసిన‌ట్లు చెప్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక కంటే ముందే ప్రారంభించాలా.. లేదంటే త‌రువాతా అన్న విష‌యంలో క్లారిటీ రాక‌పోవ‌డంతో ప్ర‌స్తుతానికి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని తెలుస్తోంది.

కాగా.. లోట‌స్ పాండ్ నుంచి బ‌య‌ట‌కొచ్చి జ‌నంలోకి వెళ్లాల‌ని  ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ చెప్ప‌డంతో జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయ‌న అన్ని జిల్లాల నేత‌ల‌తో స‌మావేశ‌మ‌వుతున్నార‌ని.. ఇప్ప‌టికే జిల్లాల పార్టీల అధ్య‌క్షులు - సీనియ‌ర్ల‌తో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో 13 జిల్లాల్లోని స‌మ‌స్య‌ల‌పై నివేదిక‌లు కూడా సిద్ధ‌మ‌వుతున్నాయ‌ట‌.

సుమారు 1500  కిలోమీట‌ర్ల మేర ఈ పాద‌యాత్ర సాగుతుంద‌ని తెలుస్తోంది. వైఎస్ హ‌యాంలో చేప‌ట్టిన నీటిపారుద‌ల ప్రాజెక్టుల మీదుగా సాగేలా దీనికి రూట్ మ్యాప్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు వినిపిస్తోంది. ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి.. ఎక్క‌డెక్క‌డ బ‌స చేయాలి.. సెక్యూరిటీ, ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిశీల‌న వంటివ‌న్నిటి విష‌యంలో ప‌క్కా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News