ఏపీ 13 జిల్లాలు కాదు..25 జిల్లాలు అదెలానంటే?

Update: 2019-05-29 04:24 GMT
ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంత‌కం కోసం కీల‌క ఫైల్ ఒక‌టి సిద్ధ‌మైంది. ఆ ఫైల్ మీద జ‌గ‌న్ సంత‌కం చేసినంత‌నే ఏపీ స్వ‌రూపం మారిపోనుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీలో 13 జిల్లాలు ఉండ‌గా.. తాజా మార్పుతో ఏపీ పాతిక జిల్లాలుగా మార‌నుంది.

తాము అధికారంలోకి వ‌స్తే ఏపీలోని ప్ర‌తి పార్ల‌మెంటు స్థానాన్ని ఒక్కో జిల్లాగా మారుస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా ముగిసిన ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత‌.. కొత్త జిల్లాల‌కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. వాస్త‌వానికి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మూడుసార్లు ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయి. అయితే.. వాటిని గ‌త ప్ర‌భుత్వం అడ్డుకుంది.

తాజాగా మాత్రం కొత్త ప్ర‌భుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంలో ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌ట‌మే కాదు.. కొత్త జిల్లాల‌కు సంబంధించిన ఫైలు మీద జ‌గ‌న్ సంత‌కం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టికే త‌మ‌కు అందిన సంకేతాల మేర‌కు రెవెన్యూ శాఖ కొత్త జిల్లాల మీద క‌స‌ర‌త్తు చేసింద‌ని.. దీని ప్ర‌కారం ఇప్పుడున్న 13 జిల్లాల స్థానే పాతిక జిల్లాలుగా మార‌నున్న‌ట్లు చెబుతున్నారు. కొత్త జిల్లాల్లో గిరిజ‌న జిల్లాను కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. ఒక‌వేళ‌.. ఇది కూడా కార్య‌రూపం దాలిస్తే 26 జిల్లాలుగా మారుతుంది.

కొత్త జిల్లాల‌తో పాల‌న మ‌రింత సౌల‌భ్యంగా మారుతుంద‌న్న పాజిటివ్ టోన్ వినిపిస్తుంటే.. కొత్త జిల్లాల కార‌ణంగా ఖ‌ర్చు త‌డిపి మోపెడు అవుతుంద‌ని.. నిర్వ‌హ‌ణ భారం పెరుగుతుంద‌ని చెబుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఆర్థికంగా భారం అవుతుంద‌న్న ఉద్దేశంతోనే గ‌త ప్ర‌భుత్వం కొత్త జిల్లాల ఫైల్ ను ప‌క్క‌న పెట్టిన‌ట్లు చెబుతున్నారు. అయితే.. కొత్త జిల్లాల హామీని జ‌గ‌న్ పార్టీ ఎన్నిక‌ల మేనిఫేస్టోలోనే క్లారిటీ ఇచ్చింది. దీనికి త‌గ్గ‌ట్లే తాజా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.
Tags:    

Similar News