జగన్ తాజా నిర్ణయంతో పులివెందుల దశ తిరిగిపోతుందట

Update: 2020-02-13 12:15 GMT
రాష్ట్రం ఏమైనా కానీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి ఉండే గ్లామర్.. గ్రామర్ కాస్త వేరని చెప్పాలి. రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నప్పటికి సీఎం నియోజకవర్గానికి ఉండే ప్రాధాన్యత వేరని చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు ఇప్పటివరకూ ఏమీ చేయలేదన్న ఫిర్యాదు ఉంది. అయితే.. పలు అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా.. వాటికి పెద్దగా ప్రచారం ఇవ్వలేదంతే. మిగిలిన పట్టణాలతో పోలిస్తే పులివెందులలో డెవలప్ మెంట్ పనులు మహా జోరుగా సాగుతాయని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులతో పాటు.. తాను గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కడప డెవలప్ మెంట్ కు సంబంధించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ రెండింటికి సంబంధించి ‘పాడా’ లపై సమీక్ష జరిపారు. శాఖల వారీగా చేపడుతున్న పనులు.. పథకాలకు సంబంధించిన అంశాల్ని సమీక్షించారు.

ఇటీవల కాలంలో చేసిన శంకుస్థాపనలు.. నిధుల ఖర్చు.. ఇతరత్రా అంశాలను సీఎంకు అధికారులు వివరించారు. వర్షాకాలంలో వరద నీరు వచ్చినప్పుడు గండికోట.. చిత్రావతి తప్పనిసరిగా నిండాలని ఆయన ఆదేశించారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

నియోజకవర్గంలో ఖర్జూరం పండించటంపై ఆసక్తి చూపుతున్న వైనాన్ని అధికారులు సీఎం జగన్ కు సమాచారం ఇచ్చారు. అయితే.. వాతావరణంతో పాటు.. ఖర్చు ఇతరత్రా అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పగా.. ఆ అంశాలపై అధ్యయనం చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక.. పులివెందులలో అంతర్జాతీయ స్కూల్ ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో విద్యను బోధించే స్కూల్ ఏర్పాటు అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని.. వెంటనే ఆ అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. సీఎం జగన్ చెప్పినట్లుగా.. అంతర్జాతీయ స్కూల్ అందుబాటులోకి వస్తే.. పులివెందుల ఇమేజ్ మారిపోవటం ఖాయం.
Tags:    

Similar News