అధికార వైసీపీ ఎమ్మెల్యే ధర్నా.. జగన్ స్పందన

Update: 2019-06-11 08:59 GMT
రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది. ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారు. సీఎం జగన్ , మంత్రులు కొలువుదీరారు. ప్రతిపక్షం టీడీపీ 23 సీట్లకే పరిమితమై ఇప్పుడు ప్రతిపక్ష పాత్రను కూడా పోషించే స్థితిలో లేదు. కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేనే ప్రతిపక్ష పాత్ర పోషించి సీఎం జగన్ ను మెప్పించి రైతులకు న్యాయం చేయడం చర్చనీయాంశంగా మారింది.

ప్రకాశం జిల్లా రాళ్లపాడు ప్రాజెక్ట్ నుంచి నీరును కామధేనువు ప్రాజెక్టుకు తరలించేందుకు గత టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో రాళ్లపాడు ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్యలు ఎక్కువ కావడంతో వారు ఆందోళన బాట పట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న లోకల్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి రాళ్లపాడుకు చేరుకొని రైతుల న్యాయమైన డిమాండ్ కు మద్దతునిచ్చి వారితోపాటు ధర్నాకు దిగడం కలకలం రేపింది..

సమస్యను పరిష్కరించాల్సిన వైసీపీ ప్రభుత్వ ఎమ్మెల్యేనే ధర్నా చేయడం.. ఇది మీడియాలో హైలెట్ కావడంతో విషయం జగన్ వరకూ వెళ్లింది. ఆయన ప్రకాశం జిల్లా నేత వైవీ సుబ్బారెడ్డితో ఆరాతీయించారు. చివరకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేస్తామని జగన్ హామీ ఇవ్వడంతో రైతులతోపాటు వైసీపీ ఎమ్మెల్యే మానుగుండ మహీధర్ రెడ్డి కూడా ధర్నా విరవించాడు.

ఇలా సమస్యల సాధనకు అధికార పార్టీ ఎమ్మెల్యే ధర్నా చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. రైతుల సమస్య తీర్చేందుకు ఎమ్మెల్యే ధర్నాకు దిగడం..వైసీపీ ప్రభుత్వం స్పందించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత దూకుడు ప్రదర్శించిన మానుగుంట విషయంలో వైసీపీ ఎలా ముందుకెళ్తుందో చూడాలి మరి.  

    

Tags:    

Similar News