నంద్యాల రోడ్ షోలో జ‌గ‌న్ ఏం చెప్పారు?

Update: 2017-08-10 04:41 GMT
ఏపీ రాజ‌కీయాల్ని హాట్ హాట్ గా మార్చేసింది నంద్యాల ఉప ఎన్నిక‌. ఏపీ అధికార‌.. విప‌క్షాలు పోటాపోటీ ప‌డుతున్న ఈ ఉప ఎన్నిక విష‌యంలో విజ‌యం కోసం రెండు వ‌ర్గాలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. సాధార‌ణంగా ఉప ఎన్నిక ఎప్పుడు జ‌రిగినా.. అధికార‌ప‌క్షానికి ఎంతోకొంత ఎడ్జ్ ఉంటుంది. నంద్యాల ఉప ఎన్నిక‌లో అలాంటి ప‌రిస్థితి లేక‌పోవ‌టం.. విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున బ‌రిలోకి దిగిన అభ్య‌ర్థి కార‌ణంగా.. ఈ ఎన్నిక పోటాపోటీగా మారి.. అధికార‌ప‌క్షానికి నిద్ర లేకుండా చేస్తుంది.

దీనికి తోడు.. విప‌క్ష నేత క‌మ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విస్తృతంగా చేస్తున్న ప్ర‌చారం తెలుగు త‌మ్ముళ్ల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేలా చేస్తున్నాయ‌న్న మాట వినిపిస్తోంది. ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌గ‌న్‌.. పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వ‌హించారు. రాత్రి వ‌ర‌కూ సాగిన ఈ రోడ్ షోకు విప‌రీత‌మైన జ‌నాద‌ర‌ణ ల‌భించింది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ భావోద్వేగంతో ప్ర‌సంగం చేశారు.

వివిధ వేదిక‌ల మీద జ‌గ‌న్ ఏం చెప్పార‌న్న విష‌యంలోకి వెళితే.. నంద్యాల‌లో తాము విజ‌యం సాధిస్తే ఏం చేస్తామ‌న్న విష‌యం మీద స్ప‌ష్ట‌మైన వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించారు జ‌గ‌న్‌. నంద్యాల‌ను త‌న గుండెల్లో పెట్టుకుంటాన‌ని.. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాన‌ని చెప్ప‌టంతో పాటు నంద్యాల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లాగా.. నంద్యాల‌ను జిల్లా కేంద్రంగా చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థిని బ‌రిలోకి దించ‌టం వ‌ల్లే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. మంత్రులు.. టీడీపీకి చెందిన పెద్ద పెద్ద నేత‌లంతా నంద్యాల రోడ్ల మీద తిరుగుతున్నార‌న్న జ‌గ‌న్‌.. ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసి ఉంటే.. అస‌లు వీళ్లు నంద్యాల మీద దృష్టి పెట్టేవారా? అని ప్ర‌శ్నించారు. ఈ ఎన్నిక‌లు కేవ‌లం ఎమ్మెల్యే సీటుకు గెలిపించుకునేందుకు జ‌రగ‌టం లేద‌ని.. మూడున్న‌రేళ్ల బాబు దుర్మార్గ‌.. అవినీతి.. అస‌మ‌ర్థ.. అన్యాయ‌.. అధ‌ర్మ పాల‌న‌కు వ్య‌తికేంగా జ‌నం వేస్తున్న ఓటుగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

నంద్యాల ప్ర‌జ‌లు వేసే ఓటుతో తాను ముఖ్య‌మంత్రిని కాన‌ని.. కానీ.. చంద్ర‌బాబు మోసాలు.. అన్యాయాలు.. అబ‌ద్ధాలు.. అధ‌ర్మాలు.. అవినీతిని చాటి చెప్పేందుకు ఓటు వేసే అవ‌కాశం నంద్యాల ఓట‌ర్ల‌కు క‌లిగింద‌న్నారు. తాజాగా జ‌రుగుతున్న ఉప ఎన్నిక రాబోయే కురుక్షేత్ర మ‌హాసంగ్రామానికి నాంది ప‌ల‌కాల‌ని తాను కోరుతున్న‌ట్లుగా పేర్కొన్నారు.

బాబు మాదిరి త‌న ద‌గ్గ‌ర డ‌బ్బుల మూట‌లు.. పోలీసుల బ‌ల‌గం.. సీఎం ప‌ద‌వి.. బాకా ఛాన‌ళ్లు.. ప‌త్రిక‌లు లేవ‌ని.. దివంగ‌త సీఎం త‌న తండ్రి వైఎస్ మీద ప్ర‌జ‌ల‌కున్న అభిమాన‌మే ఉంద‌న్నారు. తాను అబ‌ద్ధం ఆడ‌న‌ని.. మోసం చేయ‌న‌ని.. మాట ఇస్తే త‌ప్ప‌న‌ని.. ఏం చెబుతానో అదే చేస్తాన‌నే విశ్వ‌స‌నీయ రాజ‌కీయాలే త‌న బ‌లంగా జ‌గ‌న్ అభివ‌ర్ణించుకున్నారు.

అధికార అహంకారంతో బాబు క‌ళ్లు నెత్తికి ఎక్కాయంటూ తూర్పార ప‌ట్టిన జ‌గ‌న్‌.. డ‌బ్బుతో ఎమ్మెల్యేల మాదిరి ప్ర‌జ‌ల‌నూ కొనొచ్చ‌ని అనుకుంటున్నార‌ని.. అలాంటి వారికి మొట్టికాయ‌లు వేయాల‌న్నారు. అదే స‌మ‌యంలో నంద్యాల ఓట‌ర్లంద‌రి చ‌ల్ల‌ని దీవెనెలు.. ఆశీస్సులు శిల్పా మోహ‌న్ రెడ్డికి అంద‌జేయాల‌న్నారు.  ఎన్నిక‌ల ముందు బాబు ఇచ్చిన ఏ హామీని ఆయ‌న అమ‌లు చేయ‌లేద‌ని.. నంద్యాల ఉప ఎన్నిక వ‌చ్చేస‌రికి మ‌ళ్లీ త‌న టేప్ రికార్డ‌ర్‌ను ఆన్ చేశార‌న్నారు. నంద్యాల‌కు అది చేస్తాను.. ఇది చేస్తాన‌ని చెబుతున్నార‌ని.. మోసం చేసే కార్య‌క్ర‌మాన్ని మొద‌లెట్టార‌న్నారు.

బాబు మాదిరి అబ‌ద్ధాలు.. అస‌త్యాలు చెప్ప‌టం త‌న‌కు చేత‌కాద‌న్న జ‌గ‌న్‌.. నిజంగానే త‌న‌కు ఆ గుణం ఉండి ఉంటే 2014 ఎన్నిక‌ల్లో మోస‌పూరిత హామీలు ఇచ్చి విజ‌యం సాధించేవాడిన‌న్నారు. బాబు మాదిరి రైతులంద‌రికి రుణ‌మాఫీ అనికానీ తాను చెప్పి ఉంటే చంద్ర‌బాబు కూర్చున్న సీఎం కుర్చీలో తాను కూర్చొని ఉండేవాడిన‌ని జ‌గ‌న్ చెప్పారు.  చంద్ర‌బాబు మాదిరి త‌మ వ‌ద్ద డ‌బ్బు సంచులు లేవ‌న్నారు.

రాబోయే రోజుల్లో బాబు డ‌బ్బు మూట‌లు.. మూట‌లుగా తీసుకొస్తార‌ని.. ఈ మూడున్న‌రేళ్ల‌లో విప‌రీతంగా సంపాదించిన డ‌బ్బును పంచే కార్య‌క్ర‌మం చేస్తార‌న్నారు. ఎమ్మెల్యేల్ని ఏ విధంగా అయితే కొనుగోలు చేశారో.. మ‌ళ్లీ అదే తీరులో ప్ర‌జ‌ల్ని కూడా కొనుగోలు చేయాల‌న్న ఆలోచ‌న‌లో బాబు ఉన్నార‌న్నారు. బాబు మాట‌ల్ని న‌మ్మ వ‌ద్ద‌ని.. డ‌బ్బు మూట‌ల‌కు మోస‌పోక‌డ‌ద‌న్నారు.
Tags:    

Similar News