ఏపీలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన మూడు జిల్లాల్లో కాసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమైంది. స్థానిక సంస్థల కోటాలో మొత్తం 9 ఖాళీలు ఉండగా, ఆయా జిల్లాల్లో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల బలాబలాలను బేరీజు వేసుకున్న విపక్ష వైసీపీ... తనకు బలం లేని చోట అనవసర పోటీకి ఆసక్తి చూపలేదు. తనకు స్పష్టంగా బలమున్న ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప, పార్టీకి గడచిన ఎన్నికల్లో పెట్టని కోటలా మారిన కర్నూలు, ఇక నువ్వా, నేనా అన్న రీతిలో అధికార పార్టీతో సరిసమానంగానే కాకుండా... కాస్తంత మెజారిటీ ఉన్న నెల్లూరు జిల్లాలోనూ వైసీపీ తన అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే అధికార పార్టీ హోదాలో టీడీపీ ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను తనవైపు తిప్పుకునేందుకు భారీ ఎత్తున ప్రయత్నాలు చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. అదే సమయంలో తన పార్టీ టికెట్ పై విజయం సాధించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు వైరి వర్గం వైపు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు వైసీపీ కూడా పక్కా వ్యూహాలనే రచిస్తూ ముందుకు సాగింది.
కర్నూలు స్థానాన్ని గెలుచుకునేందుకు టీడీపీ భారీ యత్నమే చేసింది. ఈ క్రమంలో ఆ జిల్లాకు చెందిన వైరి వర్గాలు భూమా, శిల్పాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు నానా తంటాలు పడ్డారు. అయినా కూడా ఎక్కడ ఓటమి ఎదురవుతుందోనన్న భయంతో దివంగత నేత భూమా నాగిరెడ్డిపై విపరీతంగా ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేకే... భూమా గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డారని కర్నూలు జనం అనుకుంటున్నారు. అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి బరిలో నిలిచారు. టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేసిన గౌరు... ఇటీవలే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని కలిశారు. ఎలాగూ ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలో లేనందున ఆ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధుల ఓట్లను తనకే వేయించాలని ఆయన కోట్లను కోరారు. ఇందుకు కోట్ల కూడా అక్కడికక్కడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే తన సొంత బలంతోనే విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న వైసీపీ... కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా తోడవడంతో గెలుపు ఖాయమేనని బల్లగుద్ది మరీ చెబుతున్నాయి.
ఇక జగన్ సొంత జిల్లా కడపలోనూ వైసీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. అక్కడ వైసీపీ అభ్యర్థిగా జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి బరిలో నిలవగా, ఆయనపై పోటీకి బీటెక్ రవిని టీడీపీ దించేసింది. ఇప్పటికే అక్కడ పలువురు వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను టీడీపీ తన వైపు లాగేయగా, ఇటీవలి పరిణామాలతో అలా పార్టీ మారిన వారిలో చాలా మంది తిరిగి తమ సొంత గూడు వైసీపీలోకి చేరగా, కొందరు టీడీపీ అభ్యర్థులు కూడా వైసీపీలో చేరినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. తమ తమ అభ్యర్థులు బయటకు వెళ్లకుండా ఇరు పార్టీలు కూడా పక్కా వ్యూహాలతోనే ముందుకు వెళుతున్నాయి. అంతేకాకుండా జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా మొత్తాన్ని ఇప్పటికే పలుమార్లు చుట్టేశారు. టీడీపీ చేస్తున్న దౌర్జన్యాలను ఆయన వివరిస్తూ చేసిన ప్రచారం బాగానే వర్కవుట్ అయ్యిందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ టీడీపీ ఎంతగా కుట్రలు చేసినా.. వైసీపీదే విజయమన్న వాదన వినిపిస్తోంది.
ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే... కాంగ్రెస్ నుంచి ఇటీవలే టీడీపీలోకి చేరిన సీనియర్ రాజకీయవేత్తలు ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్దిలల సోదరుడు ఆనం విజయకుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. అదే సమయంలో ఆ జిల్లా టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని చంద్రబాబు బరిలోకి దింపారు. పార్టీ మారిన ఆనం కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని భావించినా... చివరి నిమిషంలో చంద్రబాబు వారికి మొండిచేయి చూపించి... వాకాటికి టికెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆనం సోదరులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, వైరి వర్గం అభ్యర్థిగా నిలిచిన తమ సోదరుడు విజయకుమార్ రెడ్డికే మద్దతుగా నిలుస్తున్నారన్న వాదన కూడా లేకపోలేదు. ఫలితంగా అక్కడి ఎన్నికలో వైసీపీదే విజయమన్న దిశగా ఊహాగానాలలు వినిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/