వైసీపీ అధినేత జగన్ పాదయాత్రం జగ్గంపేట నియోజకవర్గానికి చేరడంతో ఏపీలోని వంద నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్రం చేసినట్లయింది. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర గత ఏడాది నవంబరు 6వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ జగన్ 224 రోజులు పాదయాత్ర చేశారు. మొత్తం పది జిల్లాల్లో పర్యటన చేశారు. పదో జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర సాగుతోంది.
నిజానికి జగ్గంపేట నియోజకవర్గం ఆయన రూట్ మ్యాప్ లో లేదు. కానీ... అక్కడి నేతల కోరిక మేరకు తన పాదయాత్రను ఆ నియోజకవర్గంలోకి మార్చారు. దీంతో జగ్గంపేట నియోజకవర్గం జగన్ పాదయాత్రలో వందో నియోజకవర్గంగా నమోదయింది. శనివారం ఇక్కడాయన బహిరంగ సభ కూడా నిర్వహించారు.
జగన్ ఇంకా మూడు జిల్లాల్లో పర్యటన సాగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోనే పాదయాత్ర మరోపక్షం రోజులు పట్టే అవకాశముండటంతో అత్యవసరంగా పార్టీ నేతల సమావేశాన్ని జగ్గంపేటలో ఏర్పాటు చేశారు. ఆగస్టు 2వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాహనాలను తయారు చేయించారు. ప్రత్యేక హోదా కోసం తొలి నుంచి వైసీపీ పోరాడుతుండటం, హోదా కోసం ఎంపీలు సయితం రాజీనామా చేయడం వంటి విషయాలను పెద్దయెత్తున ప్రజల చెంతకు తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు.
మరోవైపు ఆదివారం జరిగే ఈ కీలక సమావేశంలో జగన్ కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. తొలుత పార్టీ కో-ఆర్డినేటర్ల మీటింగ్ లో జగన్ పాల్గొంటారు. తర్వాత తర్వాత పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు తాజా మాజీ ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - నియోజకవర్గ ఇన్ ఛార్జులతో జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీకి అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ భేటీ తరువాత జగన్ ఏదైనా కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.