జగన్ కంటే ముందే కొండారెడ్డి ప్రత్యక్షం!

Update: 2022-08-30 07:39 GMT
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం సొంత జిల్లా కడపకు వెళుతున్నారు. తన తండ్రి, దివంగత నేత వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని జగన్ అక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంతో కడప సీఎం టూర్ కోసం ముస్తాబవుతోంది. ఇదిలా ఉండగా కడపలో ముఖ్యమంత్రి రాక కోసం ఒక వైపు అధికారులు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తూ హడావుడి పడుతూంటే సందంట్లో సడెమియా అన్నట్లుగా వైఎస్ కొండారెడ్డి పులివెందుల ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది.

ఇంతకీ ఎవరీ కొండారెడ్డి. ఆయన  ప్రత్యక్షం అయితే ఎందుకు సెన్షేషన్ అంటే దాని వెనక కధా కమామీషూ చాలానే ఉంది. ఈ కొండారెడ్డి ఎవరో కాదు వైఎస్సార్ ఫ్యామిలీ మెంబరే. అయితే ఈయన దాన్ని ఆసరాగా చేసుకుని తన దందాలను కొనసాగిస్తారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మే నెలలో ఆయన ఒక ప్రముఖ కాంట్రాక్టర్ ని బెదిరించి ఆ మీదట అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు.

ఇలా వైఎస్ పేరు ముందు పెట్టుకుని కొండారెడ్డి చేస్తున్న పనులతో తనకు తీరని అప్రతిష్ట కలుగుతోందని భావించిన వైఎస్ జగన్ ఆయన్ని ఏకంగా కడప జిల్లా నుంచే బహిష్కరించారు. అక్కడ కాలు వేలూ కూడా పెట్టరాదని ఆదేశాలను జారీ చేశారు.  సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా దాన్ని తక్షణం అమలు లో పెట్టారు. అలా జైలు నుంచి విడుదల అయినా కూడా కొండారెడ్డి మే నెల నుంచి మళ్ళీ కడప జిల్లాలో ఎక్కడా అడుగుపెట్టలేదు.

అంతవరకూ ఆ ఆదేశాలు పక్కాగా అమలు అయ్యాయనే అనుకోవాలి. అయితే సడెన్ గా ఇపుడు కొండారెడ్డి పులివెందులలో ప్రత్యక్షం కావడం అది సీఎం జగన్ ఒక రోజు వ్యవధిలో అక్కడికి వస్తున్నారు అన్న వేళ ఈయన గారు హల్  చేయడమే ఇపుడు రాజకీయంగానూ చర్చగా ఉంది. అంతే కాదు కొండారెడ్డి వేముల మండ‌లానికి చెందిన వైసీపీ నాయకుడిని కలసినట్లుగా ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.

అంటే ఆయన వైసీపీ నేతలతో బాగానే టచ్ లో ఉంటున్నట్లుగా భావించాలి. అదే టైమ్ లో కొండారెడ్డి మీద జిల్లా బహిష్కరణ వేటు అలాగే ఉంది. దాన్ని తొలగించినట్లుగా ఎవరూ చెప్పలేదు. మరి ఈయన ఎలా రాగలిగారు. వైసీపీ నేతలతో ఎలా భేటీ వేస్తున్నారు అంటే అదే కదా పాలిటిక్స్ అంటున్నారు. ఇక జగన్ కడప వస్తున్న వేళ కొండారెడ్డి కూడా అక్కడకు రావడం అంటే ఆలోచించాలి అని అంటున్నారు.

అలాగే జగన్ వేముల మండలంలో నూతన సచివాలయ భవనం ప్రారంభిస్తారు అని తెలుస్తోంది. అంటే ఆ టైమ్ కి అక్కడే ఉండాలని సీఎం తో  పార్టీ  నేతల ద్వారా మాట్లాడించి  తన మీద ఉన్న బహిష్కరణ వేటును ఎత్తివేయించుకోవాలన్న ఆలోచన ఏదో కొండారెడ్డికి ఉందని అంటున్నారు. మరి కొండారెడ్డికి వైసీపీ నేతలతో పరిచయాలు బాగా ఉన్నాయి వారి ద్వారా సీఎం జగన్ మీద వత్తిడి తెచ్చి తాను గతంలో మాదిరిగా పూర్తి స్వేచ్చతో కడపలో దూకుడు చేయాలని కొండారెడ్డి భావిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.

మొత్తానికి కొండంత ధైర్యంతోనే కొండారెడ్డి కడప  జిల్లాకు వచ్చారు. అయినా ఆయన అయిపూ అజా అధికారులకు తెలియకుండా ఉంటాయా. మరి వేటు వేసిన వ్యక్తి జిల్లాలో ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. అంటే కొండరెడ్డి పవర్ ఫుల్ అనే అర్ధమవుతోంది అంటున్నారు. మరి జగన్ వస్తున్న వేళ ఆయన కొండారెడ్డి రావడం మాత్రం ప్రత్యర్ధులకు ఆయుధాన్నే ఇచ్చినట్లుగా ఉందని కొందరు వైసీపీ నేతలు అంటున్నారు. మరి దీని మీద సీఎం ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాలని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News