వైఎస్ ష‌ర్మిల క‌నిపించ‌డం లేదు అక్క‌డ‌!

Update: 2022-08-29 07:30 GMT
తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణ వైఎస్సార్ పార్టీ ఏర్పాటు చేశారు.. దివంగ‌త సీఎం వైఎస్సార్ కుమార్తె.. ష‌ర్మిల‌. అయితే ష‌ర్మిల పార్టీని అక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ, మ‌రోవైపు తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) అత్యంత బ‌లంగా ఉన్నాయి. వీటికి తోడు తాను ఉన్నానంటూ బీజేపీ కూడా అడ‌ప‌ద‌డ‌పా ఉనికి చాటుకుంటోంది. ఇంకా చిన్న‌చితాక పార్టీలు ఎలాగూ ఉన్నాయి.

రాజ‌న్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణ‌లో కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని పాద‌యాత్ర చేస్తున్నారు.. ష‌ర్మిల‌. అయితే ఇన్ని పార్టీల మ‌ధ్య ఆ పార్టీని ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయ‌న కుమారుడు కేటీఆర్‌ల‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప‌నిలో ప‌నిగా కాంగ్రెస్ ప్రెసిడెంట్‌, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపైన తీవ్ర విమ‌ర్శ‌లతో విరుచుకుపడుతున్నారు. త‌ద్వారా త‌న‌కు కూడా మీడియాలో త‌గినంత స్పేస్ దొరుకుతుంద‌ని ష‌ర్మిల భావిస్తున్నారు. అయితే ఆమె ఎన్ని ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నా.. రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు.. ఆమె వైఎస్సార్ కుమార్తె అనే కార‌ణంతో ఏమీ అన‌డం లేదు. మ‌రోవైపు కేసీఆర్, కేటీఆర్ కూడా ష‌ర్మిల‌ను అస్స‌లు పట్టించుకోవ‌డం లేదు.

తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి అయితే ష‌ర్మిల‌ను ఉద్దేశించి మంగ‌ళ‌వారం మ‌ర‌ద‌లు వ‌చ్చింద‌ని ఆమెను తీసిపారేశారు. వాస్త‌వానికి ష‌ర్మిల ఏపీలో పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఆకాంక్షించారని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆమెకు క‌డ‌ప లోక్‌స‌భ సీటు ఇవ్వ‌కుండా వైఎస్ అవినాష్‌రెడ్డికి జ‌గ‌న్ ఇచ్చారు. ఆ త‌ర్వాత త‌న‌ను రాజ్య‌స‌భ‌కైనా పంపుతార‌ని ష‌ర్మిల ఆశించారని అంటారు. అయితే అందుకు కూడా జ‌గ‌న్ ఆమెకు అవ‌కాశం ఇవ్వ‌లేదు.

దీంతో ఆమె త‌న అన్న మీద అలిగి తెలంగాణ‌లో పార్టీ ఏర్పాటు చేశార‌ని అంటుంటారు. అయితే కొంత‌మంది విశ్లేష‌కులు చెప్పేదాని ప్ర‌కారం అయితే.. ఆమె పార్టీ ఏర్పాటు చేసి రెడ్డి సామాజిక‌వ‌ర్గంలో చీలిక తేవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెబుతున్నారు. రెడ్డి సామాజిక‌వ‌ర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీతోనే ఉంది. తెలంగాణ‌లో చాలా జిల్లాల్లో రెడ్లు అత్యంత బ‌లంగా ఉన్నారు. అయితే ష‌ర్మిల పార్టీ ద్వారా పాత వైఎస్సార్ అభిమానులు, అనుచ‌రులతోపాటు రెడ్డి సామాజిక‌వ‌ర్గంలో చీలిక తెచ్చి త‌న వైపున‌కు మ‌ళ్లించుకోవ‌చ్చ‌నేది ప్లాన్ అని చెబుతున్నారు. అది కూడా బీజేపీ ఈ ఆట ఆడిస్తోంద‌ని అంటున్నారు. అధికారంలోకి వ‌చ్చే కాంగ్రెస్ పార్టీని బ‌ల‌ప‌డ‌నీయ‌కుండా ఆ పార్టీ నుంచి రెడ్డి సామాజిక‌వ‌ర్గాన్ని చీల్చ‌డం బీజేపీ ప్లాన్ అని చెబుతున్నారు. ష‌ర్మిల బీజేపీతో క‌ల‌సి ఈ డ్రామా ఆడుతున్నార‌ని అంటున్నారు.

మ‌రోవైపు కేసీఆర్, జ‌గ‌న్ ఆప్త మిత్రుల్లా వ్య‌వహ‌రిస్తున్నారు. త‌న‌ను మ‌రోమారు అధికారంలోకి రానీయ‌కుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌కొట్ట‌డానికే ష‌ర్మిల‌తో పార్టీ పెట్టించార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. వైఎస్ జ‌గ‌న్, ష‌ర్మిల మ‌ధ్య అభిప్రాయ భేదాలు ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు సైతం చెబుతున్నారు. తెలంగాణ‌లో బీజేపీ లేదా టీఆర్ఎస్ కు మేలు చేయ‌డం కోస‌మే ష‌ర్మిల పార్టీ ఉంద‌ని అంటున్నారు.

టీఆర్ఎస్‌పైన‌, కాంగ్రెస్ పార్టీపైన తీవ్ర విమ‌ర్శ‌లు చేసే ష‌ర్మిల బీజేపీ మీద ఒక్క విమ‌ర్శ కూడా చేయ‌క‌పోవ‌డం కూడా గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని చెబుతున్నారు.

కోమ‌టి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాతో రానున్న మునుగోడు ఉప ఎన్నిక‌కు సంబంధించి ష‌ర్మిల మాట్లాడ‌క‌పోవ‌డాన్ని కూడా విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. మునుగోడులో అన్ని పార్టీలు విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా క‌దులుతుంటే ష‌ర్మిల పార్టీ మాత్రం అడ్ర‌స్ లేద‌ని అంటున్నారు. బీజేపీ త‌ర‌ఫున కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి పోటీ చేస్తుండ‌టం, ఆయ‌న త‌న తండ్రికి అత్యంత స‌న్నిహితుడు కావ‌డం వ‌ల్లే ష‌ర్మిల మునుగోడు గురించి ఆలోచించ‌డం లేద‌ని చెబుతున్నారు. ఇలా ష‌ర్మిల పార్టీకి తెలంగాణ‌లో పక్కా లెక్కలున్నాయ‌ని, ఆ లెక్క‌ల ప్ర‌కార‌మే ఆమె వ్య‌వ‌హార‌శైలి ఉందని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేఏ పాల్ మాదిరిగా టీఆర్ఎస్, రేవంత్ రెడ్డిల‌పై విమ‌ర్శ‌ల‌కే ప‌రిమిత‌మై యూట్యూబ్ స్టార్ గా మిగిలిపోవ‌డం ఖాయ‌మంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News