షర్మిల తపన దేనికో?

Update: 2022-09-28 05:40 GMT
వైఎస్ షర్మిల గోలమేమిటో అర్థం కావడం లేదు. తెలంగాణలో వైఎస్సార్టీపీ అనే పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా పదవుల కోసమే తప్ప ప్రజాసేవ కోసం కాదని అందరికీ తెలిసిందే.

కాకపోతే పదవుల కోసమంటే జనాలు తప్పుపడతారని ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానంటారంతే. ఈ విషయం చెప్పేవాళ్ళకీ తెలుసు వినేవాళ్ళకీ తెలుసు. అయితే పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చేయాలని అనుకుంటున్న షర్మిల అధికార పార్టీలోని నేతలతో ఎందుకని గొడవలు పెట్టుకుంటున్నారు ?

మొదటి నుంచి కూడా షర్మిల బీజేపీ, కాంగ్రెస్ నేతలకన్నా టీఆర్ఎస్ నేతలపైనే ఎక్కువగా గురిపెట్టారు. బహుశా ప్రతిపక్షాల నేతలను టార్గెట్ చేస్తే ఉపయోగం ఉండదనే టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు.

ఇందులో కూడా ఎక్కువగా కేసీయార్ పైన మాత్రమే ఎక్కువగా రచ్చ చేస్తున్నారు. కేసీయార్ పాలనను విమర్శించని రోజు, ఆరోపణలు చేయని రోజంటు లేదు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే పాదయాత్రలో మంత్రులపై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారు.

ఇక్కడ విషయం ఏమిటంటే షర్మిల ఎవరిపైన టార్గెట్ చేసినా ఎవరు పెద్దగా స్పందించడం లేదు. అంటే ఒక రకంగా షర్మిల పార్టీ ఉనికినే ఎవరు పట్టించుకోవటం లేదు. దాంతో షర్మిలలో ఇరిటేషన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే రూటు మార్చారు. మంత్రులను లేదా పాదయాత్రలో ఏ నియోజకవర్గం ఎంఎల్ఏ ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఈ కారణంగానే ఆరుగురు మంత్రులు షర్మిలపై సభాహక్కుల నోటీసిచ్చారు స్పీకర్ కు.

ఇపుడా విషయం పాతబడిపోయి జగ్గారెడ్డి వ్యవహారం హైలైట్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి ఎంఎల్ఏ తూర్పు జయప్రకాష్ రెడ్డిపైన కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రత్యర్ధులపై షర్మిల చేస్తున్న ఆరోపణలకు మరి ఆధారాలు ఉన్నాయో లేదో కూడా ఎవరికీ తెలీదు. అన్నీ పార్టీల్లోకి జగ్గారెడ్డి మాత్రమే ఎక్కువగా షర్మిల ఆరోపణలకు రియాక్టయ్యారు. దాంతో మూడు రోజులుగా వీళ్ళిద్దరి మధ్య వివాదం మీడియాలో కనబడుతోంది. అంటే ఎదుటి వాళ్ళని తిట్టి వాళ్ళతో తిట్టించుకుని మళ్ళీ తాను తిడితే కానీ తెలంగాణలో మీడియా తనను పట్టించుకోదని షర్మిల అనుకున్నట్లు అర్ధమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News