ట్వీట్ తో ఒక్కసారి తెర మీదకు వచ్చిన జగనన్న బాణం

Update: 2019-09-21 11:47 GMT
కష్టం వచ్చినప్పుడు.. ఇబ్బంది ఎదురైనప్పుడు నేనున్నా అన్నట్లుగా తెర మీదకు వచ్చే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల.. తన పని పూర్తి కాగానే.. తన దారి తాను అన్నట్లుగా ఉండిపోతారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా జగన్ జైల్లో ఉన్న వేళ.. పార్టీ నీరసించకుండా ఉండేలా చేయటమే కాదు.. సమరోత్సాహంతో సాగేలా చేయటంలో షర్మిల సక్సెస్ కావటం తెలిసిందే.

20014 - 2019లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో తమ వాదనను ప్రజల్లోకి వెళ్లేలా చేయటంలో షర్మిల సక్సెస్ అయ్యారు. తాజా ఎన్నికల్లో పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత కూడా ఆమె ఎక్కడా కనిపించలేదు. పార్టీకి పని చేయటమే తప్పించి.. అంతకు మించి మరే విషయంలో కలుగజేసుకోని రీతిలో ఆమె వ్యవహరిస్తుంటారు. జగనన్న విడిచిన బాణంలా షర్మిలను అభివర్ణిస్తుంటారు.

తాజాగా ఆమె చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. పోలవరం లెఫ్ట్ కనెక్టివిటీ పనుల్లో 65వ ప్యాకేజీ రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వానికి రూ.58 కోట్లు ఆదా చేయటంలో గర్వపడుతున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.  మిషన్ పోలవరం అనే శీర్షికతో పెట్టిన ఈ పోస్టులో పోలవరంపై జగన్ చేసిన ప్రసంగ వీడియోను కూడా పోస్ట్ చేశారు ష్మరిల.

ఎన్నికల వేళలోనూ.. తన తండ్రి జయంతి.. వర్థంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో తప్పించి.. మిగిలిన సమయాల్లో కనిపించని షర్మిల.. తాజాగా పోలవరం రివర్స్ టెండర్ల విషయంలో ప్రభుత్వ ఘనతను కీర్తిస్తూ ట్వీట్ చేయటం ఆసక్తికరంగా మారింది. రోటీన్  కు భిన్నంగా వ్యవహరించిన షర్మిల ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమయ్యేలా చేసింది.
Tags:    

Similar News