బాబు దుర్మార్గాల‌పై వైఎస్ వివేకా

Update: 2017-03-01 07:44 GMT
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ స‌ర్కారుపై విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో దొడ్డిదారిన విజ‌యం సాధించేందుకు టీడీపీ ప్ర‌భుత్వం య‌త్నిస్తోంద‌ని ఆరోప‌ణ‌లు గుప్పించిన వివేకా... ద‌మ్ముంటే త‌న‌ను గానీ, త‌న కుటంబాన్ని గానీ రాజ‌కీయంగా ఎదుర్కొని తేల్చుకోవాల‌ని స‌వాల్ విసిరారు. స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భాగంగా వైఎస్ వివేకా... క‌డ‌ప జిల్లా నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ అభ్య‌ర్థిగా బీటెక్ ర‌వి మొన్న నామినేష‌న్ వేశారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ టికెట్ పై విజ‌యం  సాధించి, టీడీపీలో చేరిన ఓ స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధిని వైసీపీ నేత నిల‌దీశారు. ఒక పార్టీ టికెట్ పై గెలిచి మ‌రో పార్టీలోకి ఎలా వెళ‌తార‌ని నిల‌దీశారు.

ఆ సంద‌ర్భంగా స‌ద‌రు వైసీపీ నేత‌పై టీడీపీ నేత‌లు పిడిగుద్దుల వ‌ర్షం కురిపించారు. అదే రోజు ఆ జిల్లాలోని మ‌రో చోట కూడా వైసీపీ కార్య‌క‌ర్త‌పై దాడి జ‌రిగింది. నాడు క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డి టీడీపీ నేత‌ల‌పై దుందుడుకు వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు జ‌రుగుతుంటే చూస్తూ ఊరుకోబోమ‌ని కూడా ఆయ‌న హెచ్చ‌రించారు. తాజాగా నేటి ఉద‌యం క‌డ‌లోని వైసీపీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వైఎస్ వివేకా... టీడీపీ ద‌మ‌న నీతిని ఎండ‌గ‌ట్టాట‌రు. వైసీపీపై అంత క‌సి ఉంటే... త‌న‌పైన గాని త‌న కుటుంబంపైన గానీ తీర్చుకోవాలే గాని త‌మ పార్టీకి చెందిన స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులపై దాడుల‌కు తెగబ‌డ‌టం నీచ రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌మ‌ని ఆయ‌న మండిప‌డ్డారు.  

స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధుల కుటుంబాలను అంతమొందిస్తామని టీడీపీ నేతలు బెదిరించడం ప్రజాస్వామ్యంలో పనికి రాదని వైఎస్ వివేకా అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఇలాంటి చర్యలకు దిగమని చెప్పినట్లు అనుమానం కలుగుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బలహీనవర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై నిత్యం దాడులకు తెగబడుతుండటం దుర్మార్గమన్నారు. ఈ దాడులను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదని, ప్రభుత్వమే దుర్మార్గాలకు పాల్పడుతుంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయా? అని వివేకా అనుమానం వ్యక్తం చేశారు. జిల్లాలో అధికార పార్టీ కొనసాగిస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి వీలుగా జిల్లాకు ఎన్నికల పరిశీలకుడిని పంపించాలని కోరతామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News