ఏపీ అసెంబ్లీలో రోజా లొల్లి

Update: 2015-12-21 06:04 GMT
నిన్నటి వరకూ ఏపీ అసెంబ్లీని ఊపేసిన కాల్ మనీ వ్యవహారం ఇప్పుడు విపక్షానికి చెందిన ఎమ్మెల్యే రోజా కేంద్రంగా సాగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దానిపై ఏపీ స్పీకర్ ఏడాది పాటు సస్పెన్షన్ విధించటం తెలిసిందే. దీన్ని రద్దు చేయాలని ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ డిమాండ్ చేయగా.. ఏపీ అధికారపక్షం ససేమిరా అనటంతో వాతావరణం మరోసారి వేడెక్కింది.

రోజా వ్యవహారంపై తాము కోర్టుకు వెళతామని విపక్ష నేత జగన్ ప్రకటించారు. మరోవైపు.. రోజాపై సస్పెన్షన్ ను ఎత్తేయని పక్షంలో తాము సమావేశాల్ని బాయ్ కాట్ చేసేందుకు వెనుకాడమని జగన్ స్పష్టం చేశారు. దీంతో.. స్పందించిన రాష్ట్రమంత్రి యనమల.. రోజాపై సస్పెన్షన్ నిబంధనల ప్రకారమే జరిగిందని స్పష్టం చేస్తూ.. ‘‘వేటు’’ను ఎత్తేసేది లేదని తేల్చి చెప్పారు.

ఈ నేపథ్యంలో ఏపీ అధికారపక్ష వైఖరిని నిరసిస్తూ.. విపక్ష నేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ శీతాకాల సమావేశాల్ని తమ పార్టీ బాయ్ కాట్ చేస్తుందంటూ జగన్ ప్రకటించారు. ఊహించని ఈ పరిణామానికి ఏపీ అధికారపక్షం అవాక్కైన పరిస్థితి. ఈ సందర్భంగా స్పీకర్ కలుగజేసుకొని జగన్ ను వారిస్తున్నా వినకుండా ఆయన.. తన పార్టీ నేతలతో కలిసి బయటకు వెళ్లిపోయారు. తాజా పరిస్థితుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ విపక్షం కనిపించే అవకాశం లేదు.

జగన్ వైఖరిపై స్పీకర్ స్పందిస్తూ.. తప్పు చేసిన సభ్యురాలిపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరే పద్దతి ఇది కాదన్నారు. తప్పు జరిగింది.. మరోసారి అలాంటిది జగరకుండా చూసుకుంటామని చెప్పి.. సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరితే ఒక విధంగా ఉండేదని.. అందుకు భిన్నంగా విపక్షం వ్యవహరించటంపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తంగా సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు.
Tags:    

Similar News