'లక్ష్మీస్ ఎన్టీఆర్' పై రాకేష్ రెడ్డి క్లారిటీ!

Update: 2017-10-07 17:23 GMT
'లక్ష్మీస్ ఎన్టీఆర్'  చిత్రాన్ని తీయ‌బోతున్నానంటూ వ‌ర్మ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాకు వైసీపీ నేత పి.రాకేష్ రెడ్డి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారంటూ వ‌ర్మ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ సినిమాను త‌మ ఇద్దరి ఆంతరంగిక అభిమతం ప్ర‌కారం పాలిటిక్స్ కు అతీతంగా తీస్తున్నామ‌ని చెప్పారు. ఎన్టీఆర్ జీవితంలో ల‌క్ష్మీ పార్వ‌తి పాత్ర ఏమిట‌నే విష‌యాన్ని త‌న చిత్రంలో చూపించ‌బోతున్నాన‌ని వ‌ర్మ చెప్పారు. దీంతో, ఈ సినిమా వెనుక వైసీపీ ఉంద‌ని  తెలుగు త‌మ్ముళ్లు సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆ చిత్ర నిర్మాత , వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చారు.

త‌న‌కు కథ నచ్చడంతోనే ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చానని రాకేష్ అన్నారు.  అంతేకానీ, ఈ చిత్రం వెనుక ఎటువంటి రాజ‌కీయ కార‌ణాలు లేవ‌న్నారు. ఈ సినిమాకు, పార్టీకి ముడిపెట్ట‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. య‌దార్థ‌ ఘటనలను య‌థాత‌ధంగా సినిమా తీయాలన్న వ‌ర్మ‌ నిజాయితీ తనకు నచ్చిందని ఆయన చెప్పారు. అందుకే ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వ‌చ్చాన‌న్నారు. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే సినిమాను తాము తీయగలమని భావిస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన న‌టీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో తాను జోక్యం చేసుకోనని, అదంతా వర్మనే చూసుకుంటారని తెలిపారు. వర్మ మీద తనకు 200 శాతం నమ్మకం ఉందని చెప్పారు.

గ‌తంలో ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా వ‌ర్మ ప‌లు విష‌యాలు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. తాను ల‌క్ష్మీపార్వ‌తిపై  సినిమా తీయ‌బోతున్నాను కాబ‌ట్టి ఆమెను సంప్ర‌దిస్తాన‌ని వ‌ర్మ చెప్పారు. అంద‌రికీ తెలిసిన విష‌యాలు కాకుండా ఎన్టీఆర్‌లోని ఎమోష‌న‌ల్ ఫీలింగ్స్ ను ఈ సినిమాలో చూపించ‌బోతున్నాన‌ని వ‌ర్మ అన్నారు. ల‌క్ష్మీపార్వ‌తికి ఆయ‌న‌ ఎందుకంత ప్రాధాన్యం ఇచ్చారు? , ల‌క్ష్మీపార్వ‌తిని క‌లిసిన‌ప్పుడు ఆయ‌న మానసిక స్థితి ఎలా ఉంద‌నే అంశాలు త‌న సినిమాలో ఉంటాయ‌న్నారు. తాను ఆరాధించే ఎన్టీఆర్‌ ను సినిమా కంటెంట్ గా ఉప‌యోగించుకోవాల‌నే ఆలోచ‌న త‌న‌కు లేదన్నారు. తాను నిజాన్ని చూపించాల‌ని అనుకుంటున్నానని, అది అంద‌రికీ న‌చ్చ‌క‌పోవ‌చ్చ‌ని వ‌ర్మ అన్నారు. త‌న‌కు ఏ పార్టీకి సంబంధం లేదని, త‌న‌ సినిమా చూడ‌కుండానే కొంద‌రు టీడీపీ నేత‌లు కామెంట్ చేయ‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని వ‌ర్మ ఆ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా చెప్పారు.

Tags:    

Similar News