పాపం బాల‌కృష్ణ ...ఇలా అయిపోయాడుఃరోజా

Update: 2017-08-16 19:13 GMT
నంద్యాల ఉప ఎన్నిక సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు తీరును వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. నంద్యాలలోని పెద్దకొట్టాలలో వైసీపీ ఎంపీ బుట్టా రేణుకతో క‌లిసి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా సీఎం చంద్ర‌బాబు తీరును త‌ప్పుప‌ట్టారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో 600 హామీలిచ్చినా వాటిని నెరవేర్చని ఘనత చంద్రబాబుదని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలోనే ప్రజలను ప్రేమించే వ్యక్తి చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. ఏరు దాటేంతవరకు ఏటి మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉంటుందని రోజా మండిపడ్డారు.

టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులైన దివంగ‌త ఎన్టీఆర్ త‌న‌యుడు నంద‌మూరా బాలకృష్ణ  సీఎం చంద్ర‌బాబు మాట వినే అమాయకుడని రోజా ఎద్దేవా చేశారు. నంద్యాల‌లో బాల‌కృష్ణ ప్ర‌చారం చేసిన తీరుపై రోజా ఎద్దేవా చేశారు. బాబు రాసిచ్చిందే బాల‌కృష్ణ త‌న ప్ర‌సంగంలో చెప్పాడని పేర్కొంటూ పాపం అని ఎమ్మెల్యే బాలకృష్ణపై కౌంటర్‌ వేశారు. బాలకృష్ణ రాజకీయాల గురించి మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ఎమ్మెల్యే రోజా సూచించారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని అలాంటి చంద్రబాబుకు బాలకృష్ణ ప్రచారం చేయడం దారుణమ‌ని రోజా అన్నారు. వైసీపీ త‌ర‌ఫున గెలిచిన‌ 20 మంది ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలిచ్చి చంద్రబాబు కొన్నారని, ఇప్పటివరకు వారితో రాజీ నామా చేయించలేదని రోజా తెలిపారు. ఆ విషయం తెలుసుకోకుండానే బాలకృష్ణ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. బాబు వెన్నుపోటుకు, జగన్ విశ్వసనీయతకు మధ్య ఎన్నిక జరుగుతోంద‌ని రోజా అన్నారు.

దివంగ‌త శోభానాగిరెడ్డి చివరి రక్తపుబొట్టు వరకు చంద్రబాబుకు వ్యతిరేకంగానే పోరాడారని, చంద్రబాబు ఒత్తిడితోనే భూమా నాగిరెడ్డి చనిపోయారని రోజా ఆరోపించారు. కానీ వారిద్ద‌రి కుమార్తె అయిన అఖిలప్రియ అవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు పంచన చేరారని విమ‌ర్శించారు. త‌న‌ను గెలిపించిన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపైనే విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని రోజా అన్నారు. నంద్యాల ప్రజలకు మంచి అవకాశం వచ్చిందని పేర్కొంటూ ఉపఎన్నిక ద్వారా చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని రోజా కోరారు. ద‌ళితుల‌ను తీవ్రంగా అవ‌మానించేలా మంత్రులు మాట్లాడుతున్న‌ప్ప‌టికీ సీఎం చంద్ర‌బాబు ఎందుకు స్పందించ‌డం లేద‌ని రోజా ప్ర‌శ్నించారు.
Tags:    

Similar News