వైఎస్ పేరు చెప్పి వాళ్ల ఫోటోలు తీసేశారా?

Update: 2015-08-22 06:02 GMT
పార్టీలు.. వార‌సులు ఉంటే కానీ గ‌తించిన మ‌హానేత‌ల గురించి ప‌ట్టించుకోర‌న్న చేదు నిజం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏపీ అసెంబ్లీలో ఆ మ‌ధ్య దివంగ‌త మ‌హానేత.. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి చెందిన ఫోటోను తీసేయ‌టం.. దాన్ని మ‌ళ్లీ పున‌రుద్ధ‌రించాలంటూ ఆయ‌న కుమారుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ పోరాటం చేయ‌టం తెలిసిందే.

వైఎస్‌కు కొడుకు ఉండ‌టం.. అత‌గాడికి ఒక పార్టీ ఉండ‌టంతో ఏపీ స‌ర్కారు తీసేసిన త‌న తండ్రి ఫోటో గురించి పోరాటం చేయ‌టం.. ద‌శ‌ల వారీగా ఆందోళ‌న‌లు చేయ‌టం జ‌రిగింది. తాజా ఆందోళ‌న‌లో భాగంగా ఏపీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ను వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నో విష‌యం చెప్పి.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల కంటే మిగిలిన వారికి విస్మ‌యం క‌లిగేలా చేశారు.

ఇంత‌కీ కోడెల చెప్పిన ఆ మాటేమంటే.. ఏపీ అసెంబ్లీలో ఉన్న వైఎస్ ఫోటో మాత్ర‌మే కాదు.. మాజీ ముఖ్య‌మంత్రులు ప్ర‌కాశం పంతులు.. దామోద‌రం సంజీవ‌య్య‌ల ఫోటోలు కూడా తొల‌గించ‌టం జ‌రిగింద‌ని.. భ‌వ‌నం ఆధునీకీక‌ర‌ణ కార‌ణంగా ఇలా చేసిన‌ట్లు చెప్పారు. ఇన్ని చెప్పిన ఆయ‌న‌.. బిల్డింగ్ ని బాగు చేసిన త‌ర్వాత అంద‌రి ఫోటోలు పెడ‌తాన‌ని మాత్రం చెప్ప‌లేదని వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు గొణుక్కుంటున్నారు. దుర‌దృష్టం కాక‌పోతే.. గొప్ప నేత‌లుగా చెప్పుకునే ప్ర‌కాశం పంతులు.. దామోద‌రం సంజీవ‌య్య‌ల లాంటి వారి ఫోటోలు తీసిన విష‌యం కూడా స్పీక‌ర్ నోటి నుంచి వ‌చ్చే వ‌ర‌కూ ఎవ‌రూ చెప్ప‌క‌పోవ‌టం. గ‌తించిన నాయ‌కుల ఫోటోల్ని తీసే విష‌యంలో ఏదైనా ఒక ప‌ద్ధ‌తి ఉంటే బాగుంటుందేమో.
Tags:    

Similar News