జగన్ - పవన్ చేతులు కలుపుతారా? ఇప్పుడా!

Update: 2019-03-12 07:01 GMT
వచ్చే సోమవారం నుంచి నామినేషన్లు దాఖలు చేయాలి! ఇప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి - జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు చేతులు కలుపుతారా? ఇప్పుడు చర్చలు మొదలు పెడతారా? సోలోగా తేల్చుకోవడానికి రెడీ అయిన జగన్ - కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ అంటున్న పవన్ ల మధ్యన పొత్తు ప్రతిపాదన తెస్తున్నారట ఇరు పార్టీల్లోని కొంతమంది నేతలు.

అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్న కొంతమంది నేతలు - ఇటు జనసేనలో ఉన్నకొందరు నేతలు..  తాజాగా హైదరాబాద్ లో సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. పోరు నష్టం.. పొందు లాభం.. అన్నట్టుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - జనసేనలు కలిసి పోటీ చేస్తే బావుంటుందని వీరు అనుకున్నారట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొన్ని సీట్లను జనసేనకు కేటాయించాలని.. ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని సీట్లను జనసేన కోసం త్యాగం చేయాలని..  ఇరువురూ ఒక రాజీ ఫార్ములాకు రావాలని వారు తీర్మానించుకున్నారట.

జగన్ - పవన్ లు  చేతులు కలిపితే తెలుగుదేశం పార్టీ అడ్రస్ ఉండదని.. వారు అభిప్రాయపడినట్టుగా సమాచారం. ఈ విషయంలో జగన్ కు - పవన్ కు సలహా ఇవ్వాలని.. పొత్తుకు చేతులు కలపాల్సిందిగా కోరాలని వారు తీర్మానించుకున్నట్టుగా తెలుస్తోంది.

అయితే నామినేషన్ల ప్రక్రియకు మరెంతో సమయం లేదు. మరోవైపు అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ తనమునకలై ఉన్నారు. పవన్ కల్యాణ్ కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో.. పొత్తు చర్చలకు సమయం ఉందా? అనేది సందేహమే.

ఇరు పార్టీల్లోని నేతలు మాత్రం.. ఈ విషయంలో చర్చించుకున్నారట. ఒక సలహా ఇచ్చి చూద్దాం అని భావిస్తున్నారట. జగన్ - పవన్ లు చేతులు కలిపితే తిరుగుండదు అని మాత్రం ఇరు వర్గాల వారూ అనుకున్నారట. అయితే ఇప్పటికే చాలా ఆలస్యం అయిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక సమయం కూడా పెద్దగా లేదు. ఇలాంటి నేపథ్యంలో. ఏం జరుగుతుందో చూడాలి!
Tags:    

Similar News