అందరికీ జగన్ మంత్రం ఒకటేనా?

Update: 2022-07-11 05:30 GMT
ఏ స‌మ‌స్య అయినా ప‌రిష్క‌రించేందుకు అనేక దారులుంటాయి. అనేక ప‌రిష్కార మార్గాలు ఉంటాయి. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్న‌ది ఉండ‌దు. ఉండ‌కూడ‌దు కూడా ! కానీ ఏపీలో కొత్త సూత్రం ఒక‌టి అమ‌లు చేస్తున్నారు  ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.

అదేంటంటే ఎవరు ఏ నిర‌స‌న‌కు పిలుపు ఇచ్చినా ముందు గృహ నిర్బంధాల‌ను చేయిస్తున్నారు.ఆ విధంగా చేయించ‌డం ద్వారా కొంత వ‌ర‌కూ నిర‌స‌న‌లు క‌ట్ట‌డి అవుతున్నాయి. ఇంకా వీలుంటే ముఖ్య నాయ‌కుల ఇళ్ల పై నిఘా పెంచుతున్నారు.

కొన్ని సార్లు వాళ్ల‌ను తీసుకుని పోయి విచార‌ణ పేరిట వేధిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. ఒక్క విప‌క్ష నాయ‌కులు అనే కాదు టీచ‌ర్ల‌కు అదేవిధంగా పారిశుద్ధ్య  కార్మికులకూ ఇలా ఒక్క‌రేంటి ఎవ‌రు నిర‌స‌న వ్య‌క్తం చేస్తామ‌న్నా ముందుగానే గృహ నిర్బంధాలు లేదా అరెస్టులు చేయిస్తున్నారు.

తాజాగా పారిశుద్ధ్య కార్మికులు త‌మ సమ‌స్య‌లు పరిష్క‌రించాల‌ని కోరుతూ రోడ్డెక్క‌నున్నారు. ఇవాళ్టి నుంచి స‌మ్మె చేయ‌నున్నారు. వారు చెప్పిందే త‌డ‌వుగా ముఖ్య నాయ‌కుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ గృహ నిర్బంధం చేశారు అన్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఓ విధంగా త‌మ హ‌క్కుల‌ను ప్ర‌భుత్వం అణ‌చివేస్తుంద‌ని వీరంతా వాపోతున్నారు.

తాము న్యాయ‌ప‌ర‌మైన డిమాండ్ల‌నే ప్ర‌భుత్వం ముందు ఉంచామ‌ని కానీ రాత్రి నుంచి త‌మ‌పై వేధింపులు మొద‌లు అయ్యాయ‌ని వీరంతా వాపోతున్నారు. నిన్న‌మొన్న‌టి వేళ పీఆర్సీ విష‌య‌మై కొత్త విధానం ఒక‌టి అమలు చేయాల‌ని, అదేవిధంగా 11వ పీఆర్సీ రిక‌మెండేష‌న్స్ అమ‌లు చేయాల‌ని ఉపాధ్యాయులు కోరిన‌ప్పుడు కూడా ఇలానే పోలీసులు అతి చేశారని వారు అంటున్నారు

ఆ రోజు టీచ‌ర్లు పాఠాలు చెబుతున్న‌ప్పుడు బ‌డుల‌కు పోయి నోటీసులు ఇచ్చారు. కొంద‌రి ఇళ్లను సోదాలు చేశారు. ముంద‌స్తు అరెస్టులు చేశారు. గృహ నిర్బంధాలు చేశారు. ఎన్ని చేసినా కూడా ఛ‌లో విజ‌య‌వాడ ప్రొగ్రాం స‌క్సెస్ అయింది. అదే స్ఫూర్తితో తాము కూడా త‌మ స‌మ్మెను విజ‌య వంతం చేసుకుంటామ‌ని పారిశుద్ధ్య కార్మికులు అంటున్నారు. గృహ నిర్బంధాల విష‌య‌మై ప‌సుపు పార్టీ పెద్ద‌లు కూడా మండిప‌డుతున్నారు. గ‌తంలో తాము అధికారంలో ఉన్నా ఏనాడూ ఈ విధంగా చేయ‌నే లేద‌ని  చెబుతున్నారు.
Tags:    

Similar News