గజ దొంగలు కూడా గంటా ముందు బలాదూరేనట

Update: 2018-09-17 16:41 GMT
వైఎస్ జగన్ పాదయాత్ర విశాఖ నగరం దాటి భీమిలి నియోజకవర్గంలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన అక్కడి ఎమ్మెల్యే - రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుపై విరుచుకుపడ్డారు. గంటా - చంద్రబాబుల జంట ఎలా అక్రమాలకు పాల్పడుతోందో ఆయన ప్రజలకు వివరించారు. మరోవైపు ప్రజలు కూడా గంటా ఘోరాలు జగన్ ముందు ఏకరువుపెట్టారు.
   
భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి అన్నది లేనేలేదని.. పైగా ఎక్కడ భూములు కనిపించినా కబ్జా చేస్తున్నారని  జగన్‌ మోహన్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. 264వ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆనందపురం జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు దుష్టపాలనను - గంటా అవినీతి దందాలను రెండిటినీ ఎండగట్టారు.

భీమిలిలో తిరుగుతున్నప్పుడు స్థానికులు తన వద్దకు వచ్చి తమ కష్టాలు చెప్పుకొన్నారని... చంద్రబాబు నాలుగేళ్ల పాలనతో ఒక్క పని కూడా చేయలేదని... దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఇక్కడ భూములను దోచేస్తున్నారని చెప్పారని జగన్ అన్నారు. ప్రభుత్వ భూములు - ఇనామ్‌ భూములు - అసైన్డ్‌ భూములు అన్న తేడాలేకుండా అన్నిటినీ మింగేస్తున్నారని అన్నారు. మంత్రి గంటా శ్రీనివాస రావు - సీఎం చంద్రబాబు ట్రైనింగ్‌ లో భూదందాల్లో ఆరితేరిపోయారని భీమిలి ప్రజలు తనతో చెప్పారని జగన్ అన్నారు. 
   
ఎన్నికలు వచ్చేప్పటికి దొంగల ముఠా స్థావరాలు మార్చినట్లు గంటా  నియోజకవర్గాలను మారుస్తారని కూడా ఆయన నియోజకవర్గ ప్రజలు తనతో చెప్పారంటూ జగన్ గంటాను తూర్పారబట్టారు.  మంత్రి గంటా అండదండలతో ఎమ్మార్వోలు అన్యాయాలు చేస్తున్నారని...  హుద్‌ హుద్‌ తుఫాను కారణం చూపించి ఎమ్మార్వో ఆఫీసుల్లో ఎఫ్ ఎంబీలు - ఆర్ ఎంబీలు - మ్యాపులు మాయమైపోయ్యాయని చెప్పి రికార్డులను తారుమారు చేసి భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు.
Tags:    

Similar News