పులివెందుల‌కు జ‌గ‌న్‌!

Update: 2019-05-13 14:18 GMT
ఏపీ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలకు ఇంకా ప‌ది రోజు స‌మ‌యం ఉంది. గత నెల 11న పోలింగ్ జ‌రిగితే... ఈ నెల 23న ఫ‌లితాలు వెలువ‌డ‌నున‌న్నాయి. పోలింగ్ ముగియ‌గానే విజ‌యంపై విప‌క్ష వైసీపీ ధీమా వ్య‌క్తం చేసింది. వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని చెప్పేసింది. పోలింగ్ ముగిసిన త‌ర్వాత కంటే కూడా చాలా ముందు నుంచే ఈ సారి వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని అటు పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు ఆ పార్టీ శ్రేణులంతా చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో అధికార టీడీపీ కూడా ఈ సారి కూడా త‌మ‌దే గెలుప‌ని లెక్క‌లు వేసి మ‌రీ చెబుతోంది. అయితే గెలుపుపై వైసీపీలో క‌నిపించినంత జోష్ టీడీపీలో క‌నిపించ‌డం లేద‌ని మాత్రం చెప్పాలి.

ఎన్నిక‌ల ఫ‌లితాలకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ‌... వైసీపీలో నిజంగానే హ‌డావిడి మొద‌లైపోయింద‌ని చెప్పాలి. పోలింగ్ ముగిసిన వెంట‌నే మీడియా ముందుకు వ‌చ్చి తాము గెలుస్తున్నామ‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ఆ త‌ర్వాత రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. అయితే ఫ‌లితాల వెల్ల‌డికి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ ఆయ‌న కూడా స్పీడ్ పెంచేశారు. నేడు త‌న సొంత ఇలాకా క‌డ‌ప జిల్లా పులివెందుల‌కు బ‌య‌లుదేరుతున్న జ‌గ‌న్‌.. ఏకంగా మూడు రోజుల పాటు అక్క‌డే మ‌కాం వేయ‌న్నారు. మూడు రోజుల పులివెందుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌గ‌న్‌... అక్క‌డేమీ రెస్ట్ తీసుకోవ‌డం లేద‌ట‌. మూడు రోజుల పాటు ప్ర‌జా ద‌ర్బార్ పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న జ‌గ‌న్‌... ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కానున్నార‌ట‌. అంతేకాకుండా ప్ర‌జ‌ల నుంచి ఆయా స‌మ‌స్య‌ల‌పై వ‌చ్చే విన‌తుల‌ను స్వీక‌రించ‌డంతో పాటుగా వాటి ప‌రిష్కారంపైనా ఆయ‌న దృష్టి సారిస్తార‌ట‌.

మూడు రోజుల పాటు పులివెందుల‌లో ప్ర‌జా ద‌ర్బార్ అంటే మాట‌లు కాదు క‌దా. ఎందుకంటే... ఎప్పుడు పులివెందుల వెళ్లినా... ఒక రోజో, అర రోజో అక్క‌డ ఉన్న ఆయ‌న జిల్లాలోని ఇత‌ర ప్రాంతాల‌ను కూడా చుట్టేసేవారు. అయితే అందుకు విరుద్ధంగా ఆయ‌న ఈ ద‌ఫా మూడు రోజుల పాటు పులివెందుల‌లో ఉండ‌టంతో పాటు మూడు రోజులు కూడా ప్ర‌జా ద‌ర్బార్ల‌ను నిర్వ‌హించ‌డ‌మంటే సాధార‌ణ విష‌యం కాదు క‌దా. ఎలాగూ గెలుస్తున్నామ‌న్న ధీమాతోనే జ‌గ‌న్ ఈ కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఓ వైపు పులివెందుల‌లో జ‌గ‌న్ మూడు రోజుల పాటు తిష్ట వేయ‌నుండ‌గా... ఆ పార్టీ నేత‌లు కూడా త‌మ‌తమ ప్రాంతాల్లో ఇదే త‌ర‌హా కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టే అవ‌కాశాలున్నాయ‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. అంటే... మొత్తంగా వైసీపీలో హ‌డావిడి మొద‌లైన‌ట్టేన‌న్న మాట‌.


Tags:    

Similar News