వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం బంధువుల‌కు పంచిపెట్టేది కాదా?

Update: 2022-07-09 11:30 GMT
వైఎస్సార్సీపీ మూడో ప్లీన‌రీ గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ స‌మీపంలో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. జూలై 8న ప్రారంభ‌మైన ఈ ప్లీన‌రీ జూలై 9న శ‌నివారం ముగుస్తుంది. ప్లీన‌ర‌లో భాగంగా వైఎస్సార్సీపీ నేత‌లు వివిధ‌ తీర్మానాలను ప్ర‌వేశ‌పెట్టి ఆమోదం తెలుపుతున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పేద‌ల అభివృద్ధే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నార‌ని కొనియాడారు. ఆయ‌న 50-75 ఏళ్ల క్రిత‌మే ఏపీలో ఉండి ఉంటే పేద‌ల ప‌రిస్థితి ఈ విధంగా ఉండేది కాద‌న్నారు. ప‌నిలో ప‌నిగా అధికారాన్ని బంధువుల‌కు, శ్రేయోభిలాషుల‌కు పంచిపెట్టే ప్ర‌భుత్వం కాదిది అని కూడా ధ‌ర్మాన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్య‌ల‌పైనే నెటిజ‌న్ల‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

ముఖ్య‌మంత్రి చిన్నాన్న కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి క‌డ‌ప ఎంపీగా ఉన్నార‌ని, అలాగే జ‌గ‌న్ సొంత మేన‌మామ (అమ్మ త‌మ్ముడు) ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి క‌మ‌లాపురం ఎమ్మెల్యేగా ఉన్నార‌ని నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు. అలాగే వైఎస్ జ‌గ‌న్ చిన్నాన్న (సొంత పిన్ని భ‌ర్త‌) వైవీ సుబ్బారెడ్డి వైఎస్సార్సీపీలో కీలకంగా ఉన్నార‌ని చెబుతున్నారు.

అంతేకాకుండా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ గా కూడా వైవీ సుబ్బారెడ్డి కొన‌సాగుతున్నార‌ని పేర్కొంటున్నారు. అలాగే త‌మ కుటుంబ ఆడిట‌ర్ గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డికి, త‌మ ఒక‌ప్ప‌టి వ్యాపార భాగ‌స్వామి సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి జ‌గ‌న్ కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌ని గుర్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీలో నెంబ‌ర్ టూ, త్రీ పొజిష‌న్స్ లో విజ‌య‌సాయిరెడ్డి, స‌జ్జ‌ల‌నే ఉన్నార‌ని అంటున్నారు.

మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో కుటుంబ స‌భ్యుల‌కు, బంధువుల‌కు జ‌గ‌న్ పంచిపెట్ట‌లేద‌ని ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు చెప్ప‌డం కామెడీగా ఉంద‌ని నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. జ‌గ‌న్ ఎవ‌రెవ‌రికి ప‌దవులు క‌ట్ట‌బెట్టారో తెలియ‌ద‌నుకుంటున్నారా అని నిల‌దీస్తున్నారు. ఇప్ప‌టికైనా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అవాస్త‌వాలు చెప్ప‌డం క‌ట్ట‌బెట్టాల‌ని కోరుతున్నారు.  

కాగా ప్లీన‌రీలో రెండో రోజు మాట్లాడిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం బంధువులకు, శ్రేయోభిలాషులకు పంచి పెట్టే ప్రభుత్వం కాదని అన్నారు. అలాగని ఎవరైనా అనుకుంటే వారికి ఈ పార్టీలో నిరుత్సాహం తప్పద‌న్నారు. ఏడాదిలోనే ప్రభుత్వం పని అయిపోతుందని చాలామంది అన్నార‌ని.. అయితే మూడేళ్లు పూర్తి చేసుకున్నామ‌ని తెలిపారు. రెండోసారి, మూడోసారి కూడా సీఎంగా జ‌గ‌న్ ఎన్నిక‌వుతార‌ని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News