బొత్స కబ్జాలోకి ఉత్తరాంధ్ర వైకాపా!

Update: 2016-04-14 12:22 GMT
బొత్స సత్యనారాయణతో వ్యవహారం అంతే 'ఒంటె ఎడారి వర్తకుడు' కథలాగా ఉంటుంది.

''వెనకటికి ఓ ఒంటెతో కలిసి వర్తకుడు ఎడారిలో వెళుతున్నాడు. రాత్రి అయ్యాక గుడారం వేసుకుని లోన పడుకున్నాడు. కాసేపటికి ఒంటె తల గుడారంలోకి దూర్చి బయట బాగా చలిగా ఉంది. తల వరకు లోపల పెట్టుకుంటాను అని అడిగింది. ఆయన ఓకె అన్నాడు. కాసేపటికి కాస్త మెడ కూడా లోనికి తెస్తాను అని పర్మిషన్‌ అడిగింది. అందుకు కూడా ఓకె అన్నాడు. మరునాడు ఉదయం లేచేసరికి ఒంటె గుడారంలో ఉంది. వ్యాపారి బయట చలిలో పడున్నాడు.'' దీనినే ఒంటె ఎడారి వర్తకుడి కథ అంటారు. బొత్స సత్యనారాయణతో వ్యవహారం కూడా అలాగే ఉంటుంది. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చాలా చిన్న స్థాయినుంచి అంచెలంచెలుగా తన ప్రాంతంలో సీనియర్లను శాసించే స్థాయికి ఎదిగిపోయారు.

ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లోకి వస్తున్నప్పుడు స్థానికంగా ఆయన పట్ల వైరం ఉన్న వారంతా దాన్ని నిరసించారు. పర్యవసానంగా జగన్‌ - బొత్స సత్యనారాయణకు కొన్ని కండిషన్స్‌ పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. విశాఖ రాజకీయాలు మాత్రమే చూసుకోవాలని, ఉత్తరాంధ్ర మొత్తం పార్టీ రాజకీయాల్లో వేలుపెట్టడం కుదరదు అని జగన్‌ అప్పట్లో ఆయనకు నిషేధం విధించారు. అన్ని కండిషన్స్‌ ఒప్పుకునే బొత్స వైకాపాలోకి వచ్చారు. జగన్‌ మొత్తం రాష్ట్రంలో తనే పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని అనుకునే నాయకుడు. ఒక్కొక్క ప్రాంతానికి అయినా సరే మరో పవర్‌ సెంటర్‌ ఉండడాన్ని ఆయన ఇష్టపడరు.

కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది. ఉత్తరాంధ్ర మొత్తం అనివార్యంగా బొత్స సత్యనారాయణ కబ్జాలోకి వెళ్లిపోతున్నది. ప్రస్తుతం బొబ్బిలి రాజులు కూడా పార్టీ వీడి తెలుగుదేశంలోకి పోతూ ఉండడంతో.. బొత్స సత్యనారాయణ యాక్టివేట్‌ అయ్యారు. వైకాపాను బలోపేతం చేసే చర్యల పేరిట తన మనుషులను పార్టీలోకి తెస్తున్నారు. మాజీ విప్‌ శంబంగిని కూడా పార్టీలోకి తెస్తున్నట్లు సమాచారం. క్రమంగా ఉత్తరాంధ్ర వైకాపా మొత్తం బొత్స సత్యనారాయణ చెప్పుచేతల్లోకి వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు. ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు బొత్స నిర్దేశించినట్లుగా జగన్‌ నిర్ణయాలు తీసుకోవాల్సిన రోజులు కూడా రావచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు మరి! జగన్‌ ఈ పర్యవసానాలన్నిటినీ ఊహించగలుగుతున్నారో లేదో!
Tags:    

Similar News