ఏపీ పోల్.. జగన్ అంతర్గత సర్వేలు ఏం చెప్పాయి?

Update: 2019-04-20 09:00 GMT
పోలింగ్ కు ఫలితాలకు మధ్యన చాలా సమయం ఉండటంతో.. ఏపీ రాజకీయం విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఫలితాలు ఇప్పడప్పుడే విడుదల అయ్యే అవకాశాలు లేకపోవడంతో.. ఎవరు గెలుస్తారనే అంశంపై రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సామాన్య జనాలకు ఈ విషయంలో ఆసక్తి ఉంది. ఇక ఏదో ఒక రాజకీయ పార్టీని అభిమానించే వారి ఆసక్తుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. వివిధ పార్టీలకు వీరాభిమానులు అయిన వాళ్లు అయితే.. టెన్షన్ పడుతున్నారు కూడా. అందరి ఆసక్తీ అలా ఎన్నికల ఫలితాల మీదే ఉంది.

ఇలాంటి నేపథ్యంలో తాజాగా మరో వ్యవహారం వార్తల్లోకి వచ్చింది. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అంతర్గత సర్వే అంచనా అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఒకవైపు రాజకీయ పరిస్థితి గురించి  ఎప్పటికప్పుడు పీకే టీమ్ ద్వారా అధ్యయనం చేయించుకొంటూ వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కీలకమైన సమయంలో మొత్తం ఆరు ఏజెన్సీలకు వేర్వేరుగా సర్వేల బాధ్యతలు అప్పగించారట.

ఒకవైపు పీకే టీమ్ ఇచ్చే రిపోర్టులను చూసుకొంటూనే జగన్ మోహన్ రెడ్డి మరోవైపు ఆరు ఏజెన్సీలతో వేర్వేరుగా సర్వేలు చేయించుకున్నట్టుగా సమాచారం. వాటి రిపోర్టులు అన్నీ జగన్ కు ఫుల్ పాజిటివ్ గా అందినట్టుగా అంచనా. ఆ వేర్వేరు సర్వేలన్నీ ఒకే మాట చెప్పాయని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం తొంభై సీట్లు గరిష్టంగా నూటా ఇరవై వరకూ ఇచ్చే అవకాశం ఉందని ఆ అధ్యయనాలు తేల్చాయని సమాచారం.

90 నుంచి 120 మధ్యన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు దక్కే అవకాశం ఉందని ఆ అధ్యయనాలు పేర్కొన్నాయట.  ఈ మేరకు ప్రచారం అయితే సాగుతూ ఉంది. అసలు కథ ఏమిటో.. ఫలితాల రోజున తెలియనుంది!
Tags:    

Similar News