ఈ కీలక నియోజకవర్గంపై తీవ్ర ఆందోళనలో వైసీపీ!

Update: 2022-11-15 04:25 GMT
గుంటూరు జిల్లా మంగళగిరి రాష్ట్రంలోనే కీలక నియోజకవర్గం. ఎందుకంటే ఈ నియోజకవర్గం పరిధిలోనే రాజధాని అమరావతి ప్రాంతం విస్తరించి ఉంది. అదేవిధంగా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌ గత ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గం కూడా.

ఇలాంటి కీలక నియోజకవర్గంలో వైసీపీ తీవ్ర ఆందోళనలో ఉందని సమాచారం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఇక్కడ నారా లోకేష్‌ను వైసీపీ ఓడించింది. ఆ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

ఈ నేపథ్యంలో మంగళగిరి నుంచి ఈసారి లోకేష్‌ పోటీ చేయరని  సీపీ భావించింది. అయితే అనూహ్యంగా లోకేష్‌ ఇక్కడ నుంచే బరిలోకి దిగాలని నిశ్చయించుకున్నారు. దీంతో వైసీపీ కూడా నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న చేనేత సామాజికవర్గంపై దృష్టి సారించింది.

చేనేత సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావును పార్టీలో చేర్చుకుని ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. అంతేకాకుండా చేనేత సామాజికవర్గానికే చెందిన మంగళగిరి మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ కాండ్రు కమలను కూడా పార్టీలో చే ర్చుకుంది.

అదేవిధంగా మంగళగిరి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న గంజి చిరంజీవిని కూడా పార్టీలో చేర్చుకుని టీడీపీకి షాక్‌ ఇచ్చింది. గంజి చిరంజీవిని వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా ప్రకటించింది.

అయితే దీనికి విరుగుడు వ్యూహం రచించిన టీడీపీ ఏకంగా వైఎస్‌ జగన్‌ సామాజికవర్గంపైనే దృష్టి సారించింది. నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అసంతృప్తిగా ఉన్న రెడ్డి సామాజికవర్గం నేతలపై దృష్టి సారించింది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడుగా ఉన్న వేణుగోపాల్‌రెడ్డిని టీడీపీలోకి లాగేసింది.

అంతేకాకుండా 50 మంది వరకు రెడ్డి సామాజికవర్గం నేతలు టీడీపీలో చేరిపోయారు. ఇప్పటంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాపుల ఇళ్లను కూల్చివేసిన సంగతి తెలిసిందే. వీరిని పరామర్శించడానికి నారా లోకేష్‌ ఇప్పటం పర్యటించారు. అలాగే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని లోకేష్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు వేణుగోపాల్‌రెడ్డి సహా 50 మంది నేతల వరకు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

దీంతో వైసీపీకి గట్టి దెబ్బ తగిలిందని చెప్పుకుంటున్నారు. మరోవైపు గెలిచిన దగ్గర నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో కనిపించింది చాలా తక్కువ అని ప్రజల్లో అసంతృప్తి ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో మంగళగిరిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని.. ఒక నివేదిక సమర్పించాలని వైసీపీ అధిష్టానం గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలు మేకతోటి సుచరితను ఆదేశించినట్టు సమాచారం.

వచ్చే ఎన్నికల్లోనూ నారా లోకేష్‌ను ఓడించాలని సిద్ధమవుతుంటే సొంత సామాజికవర్గం రెడ్లే పార్టీని వీడి టీడీపీలో చేరడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News