వైసీపీ ప్ర‌శ్న‌!... బుట్టా మాట‌లేమ‌య్యాయి?

Update: 2017-10-16 11:28 GMT
క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక‌పై వైసీపీ విరుచుకుప‌డింది. 2014లో వైసీపీ త‌ర‌ఫున క‌ర్నూలు జిల్లా నుంచి ఎంపీగా గెలిచిన ఆమె తాజాగా టీడీపీ జ‌ట్టులోకి జంప్ చేస్తుండ‌డంపై విప‌క్ష నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ ప‌ట్ల ఏమాత్రం కృత‌జ్ఞ‌త‌లు కూడా చూపించ‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. వాస్త‌వానికి ఎన్నికల రిజ‌ల్ట్ విడుద‌లైన వెంట‌నే అప్ప‌టి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మాదిరిగానే ఈమె కూడా జ‌గ‌న్ కు హ్యాండిచ్చి బాబు వెనుక సైకిల్ ఎక్కేస్తార‌ని భారీ ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయితే, అప్ప‌ట్లో మౌనంగా ఉన్న రేణుక త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని అంద‌రూ భావిస్తున్న నేప‌థ్యంలో పొలిటిక‌ల్‌ గా యూట‌ర్న్ తీసుకోవ‌డం సంచ‌ల‌నం సృష్టించింది.

ఈ ప‌రిణామాన్ని ముందే ఊహించిన జ‌గ‌న్.. ఆమె ఇటీవ‌ల పిలిచి మాట్లాడారు. అయినా కూడా రేణుక .. టీడీపీ ట్రాప్ నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇదే విష‌యంపై మాట్లాడిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య బుట్టాపై నిప్పులు చెరిగారు. సాధారణ మహిళగా ఉన్న ఆమెను జ‌గ‌న్‌.. పిలిచి పిల్ల‌నిచ్చిన‌ట్టు.. కర్నూలు ఎంపీ టిక్కెట్‌ ఇచ్చి గెలిపించార‌ని, అయినా  కనీస కృతజ్ఞత కూడా లేకుండా రేణుక వ్య‌వ‌హ‌రించార‌ని విమ‌ర్శించారు.   ప్రాణం ఉన్నంతవరకూ జగన్‌ వెంటే నడుస్తానని చెప్పిన ఆమె ఇప్పుడు ఆ మాట‌లను ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు.

తనపై వస్తున్న వార్తలతో రేణుక మనస్తాపం చెందినట్లు వెలువడ్డ వార్తలపై స్పందిస్తూ... గెలిచిన మూడో రోజే ఆమె భర్త పచ్చ కండువా కప్పుకున్నప్పుడు తామెంత మనస్తాపం చెంది ఉంటామో గుర్తించాలన్నారు. రహస్యంగా వెళ్లి సీఎం చంద్రబాబును కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఫిరాయింపుదారులకు టీడీపీలో ఎలాంటి గౌరవం దక్కుతోందో తెలుసుకోవాలని రామయ్య సూచించారు. అక్కడ కనీసం ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఫిరాయించిన నేత‌ల‌కు మర్యాద ఇవ్వడం లేదన్న విషయాన్ని గమనించాలన్నారు. ఫిరాయింపుదారులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  మొత్తానికి ఈ వ్యాఖ్య‌లు రేణుక‌ను డిఫెన్స్‌లో ప‌డేశాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.
Tags:    

Similar News