ప్రివిలేజెస్‌ క‌మిటీలో వైసీపీకి ఒక్క కుర్చీనేనా?

Update: 2017-03-05 04:51 GMT
ఏపీ అసెంబ్లీలో ఇప్పుడు కీల‌కంగా మారిన ప్రివిలేజెస్ క‌మిటీపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. గతంలో ఈ క‌మిటీ ఉంద‌న్న విష‌యం కూడా జ‌నానికి అంత‌గా తెలిసేది కాదు. అయితే వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఏడాది పాటు స‌స్పెన్ష‌న్ విధింపు, ఆ త‌ర్వాత తాజాగా స‌ద‌రు స‌స్పెన్ష‌న్‌ ను మ‌రో ఏడాది పాటు పొడిగించే సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న త‌రుణంలో ఈ క‌మిటీ పేరు అంద‌రి నోటా వినిపిస్తోంది. అస‌లు ఈ క‌మిటీ బాధ్య‌త‌లు ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... అసెంబ్లీలోని స‌భ్యులెవ‌రైనా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తే... వారిపై ఫిర్యాదులు వ‌స్తే... అలాంటి ఫిర్యాదుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి స‌ద‌రు స‌భ్యుడి ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంద‌న్న విష‌యాన్ని తేల్చాల్సింది ఈ క‌మిటీనే. అంటే స‌భ‌లో స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంద‌న్న విష‌యాన్ని ఈ క‌మిటీ నిర్ణ‌యిస్తుంద‌న్న మాట‌. ఇంత‌టి గురుత‌ర బాధ్య‌త ఉన్న క‌మిటీలో అధికార పార్టీ స‌భ్యుల‌తో పాటు స‌భ‌లోని విప‌క్షాల‌కు చెందిన స‌భ్యుల‌కు కూడా స్థానం క‌ల్పించాలి.

ఇక ఆయా పార్టీల‌కు ఈ క‌మిటీలో ఎన్ని స్థానాలు ఇవ్వాల‌న్న విష‌యం... ఆయా పార్టీల‌కు స‌భ‌లో ఉన్న బ‌లాబలాల‌పై  ఆధార‌ప‌డి ఉంటుంది. దీనిని అసెంబ్లీ స్పీక‌రే నిర్ణ‌యించాల్సి ఉంటుంది. ఏపీ అసెంబ్లీలో ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ఈ క‌మిటీకి టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే గొల్ల‌ప‌ల్లి సూర్యారావు చైర్మ‌న్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చైర్మ‌న్‌ తో పాటు క‌మిటీలో ఆరుగురు స‌భ్యులున్నారు. ఈ ఆరుగురు స‌భ్యుల విష‌యానికి వ‌స్తే... స‌భ‌లో అధికార పార్టీగా ఉన్న టీడీపీ - దాని మిత్ర‌ప‌క్షం బీజేపీకి క‌లిపి ఐదు స్థానాలు కేటాయించ‌గా - విపక్ష హోదాలో ఉన్న వైసీపీకి మాత్రం ఒకే ఒక స‌భ్యుడు ఉన్నారు. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత స్పీక‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కోడెల శివ‌ప్ర‌సాద్ ఈ క‌మిటీని ఏర్పాటు చేశారు. గొల్ల‌ప‌ల్లి చైర్మ‌న్‌ గా ఉన్న ఈ క‌మిటీలో అధికార ప‌క్షం నుంచి నంద‌మూరి బాల‌కృష్ణ‌ - బండారు స‌త్యనారాయ‌ణ మూర్తి - కురుగొండ్ల రామ‌కృష్ణ‌ - బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి - వైసీపీకి చెందిన  పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి - జ్యోతుల నెహ్రూల‌ను స‌భ్యులుగా ఉన్నారు.

అయితే ఆ త‌ర్వాత చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో జ్యోతుల నెహ్రూ... వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ప్ర‌స్తుతం ఆయ‌న క‌మిటీలో స‌భ్యుడిగా ఉన్న‌ట్లుగానే అసెంబ్లీ అధికారిక వెబ్ సైట్ చెబుతోంది. జ్యోతుల టీడీపీ గూటికి చేర‌డంతో వైసీపీకి చెందిన మ‌రో స‌భ్యుడికి క‌మిటీలో స్థానం క‌ల్పించాల్సి ఉంది. అయితే ఈ విష‌యాన్ని స్పీక‌ర్ కోడెల దాదాపుగా మ‌రిచిపోయిన‌ట్లే ఉన్నారు. ఈ క్ర‌మంలో 50 మంది దాకా బ‌ల‌మున్న వైసీపీకి ఈ క‌మిటీలో కేవ‌లం సింగిల్ సీటు  మాత్ర‌మే ద‌క్కింది. అంటే... ఎప్పుడు స‌మావేశం జ‌రిగినా.. కమిటీ చైర్మ‌న్ తోపాటు మిగిలిన ఆరుగురు స‌భ్యుల్లో ఐదుగురు అధికార పక్షానికి చెందిన వారుండ‌గా, విప‌క్షానికి చెందిన వారు ఒక్క‌రే ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ క‌మిటీ ఏదేనీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటే... మెజారిటీ స‌భ్యులున్న టీడీపీ వాద‌నే నెగ్గుతోంది త‌ప్పించి... అస‌లు వైసీపీ త‌న స్వ‌రాన్ని కూడా గ‌ట్టిగా వినిపించ‌లేని స్థితిలో ఉంద‌న్న‌ది జ‌నం మాట‌. మ‌రి క‌మిటీని స‌మ‌తూకంగా ఉంచ‌కుండా... ఆ క‌మిటీ ఇచ్చిన నిర్ణ‌యాల‌ల మేర‌కు స్పీక‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేసుకుంటూ పోతే.. విప‌క్షానికి  అన్యాయం జ‌రిగిన‌ట్టే క‌దా. మ‌రి ఈ అన్యాయానికి చెక్ ప‌డాలంటే... వైసీపీకి ఈ క‌మిటీలో న్యాయంగా అందాల్సిన మ‌రో స్థానం కూడా కేటాయించాల్సిందే. మ‌రి ఈ ప‌నిని కోడెల ఎప్పుడు చేస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News