హోదా పోరాటం అణచివేత తగదు : ఐవిరెడ్డి

Update: 2016-09-11 07:15 GMT
ప్రత్యేకహోదా సాధించడం కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సాగిస్తున్న పోరాటాన్ని చంద్రబాబునాయుడు ప్రభుత్వం దుర్మార్గంగా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నదని ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి ఐవి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలనే ప్రజల ఆకాంక్షలను అణచివేయడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఐవి రెడ్డి చెప్పారు. వైఎస్‌ జగన్మోహన రెడ్డి పిలుపు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ లో భాగంగా గిద్దలూరు బంద్‌ చేయిస్తున్న వైకాపా ఇన్చార్జిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోదా వలన రాష్ట్రానికి ప్రయోజనాలు దక్కకుండా - కాంట్రాక్టర్లతో కలిసి పంచుకోవడానికి చంద్రబాబునాయుడు ప్యాకేజీలంటేనే ఎక్కువ ఆశ పడుతున్నారంటూ దెప్పిపొడిచారు. వాస్తవంగా రాష్ట్రం బలోపేతంగా ఎదగడం - మూలాల్లోంచి అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుగా ఉన్నదని చెప్పారు.

అందుకే హోదా వల్ల పెద్దగా ప్రయోజనం లేదని జనాన్ని మభ్యపెడుతూ, ప్యాకేజీలను తీసుకోవడానికి ఎగబడుతున్నారని - కేంద్రంలో మోదీ వద్ద తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని  - చంద్రబాబునాయుడు కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని ఐవిరెడ్డి ఆరోపించారు.
Tags:    

Similar News