బాబు దోపిడీకి న్యాయపీఠం అడ్డుకట్ట : ఐవి రెడ్డి

Update: 2016-09-13 08:02 GMT
అధికారం చేతిలో ఉన్నది కదాని అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్రలకు న్యాయస్థానం చెక్‌ పెట్టిందని ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఇన్ చార్జి ఐవి రెడ్డి అన్నారు. స్విస్‌ ఛాలెంజ్‌ విధానం లో అమరావతి రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ టెండర్లు ఆహ్వానిస్తున్న ప్రక్రియపై హైకోర్టు స్టే ఇవ్వడంపై ఐవిరెడ్డి స్పందించారు. స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో టెండర్లు కట్టబెట్టడం అంటేనే అది పూర్తిగా గుట్టుచప్పుడు కాకుండా.. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న సామెత చందంగా తయారవుతున్న వ్యవహారంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్మోహనరెడ్డి తొలినుంచి ఆరోపిస్తూనే ఉన్నారని ఐవి రెడ్డి చెప్పారు.

అయితే, ఈ కుట్రల పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ఖాతరు చేయకుండా.. మొండిగా ముందుకు వెళ్లినందుకు న్యాయస్థానం రూపంలో చంద్రబాబు సర్కారుకు ఎదురుదెబ్బ తప్పలేదని ఐవిరెడ్డి చెప్పారు. ఇది తుది తీర్పు కాదు.. హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీం కోర్టుకు వెళ్తాం.. అంటూ తెలుగుదేశం నాయకులు ఇప్పటికీ జనాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని.. వారి ప్రభుత్వం పాల్పడుతున్న కుట్రలను ప్రజలు తేటతెల్లంగా గమనిస్తున్నప్పటికీ కూడా దులిపేసుకుని పోవడం వారికి మాత్రమే చెల్లిందని ఐవిరెడ్డి ఎద్దేవా చేశారు.

ఇప్పటికైనా చంద్రబాబు తన బుద్ధి మార్చుకోవాలని.. స్విస్‌ చాలెంజ్‌ రూపంలో దోపిడీకి తిలోదకాలు ఇవ్వాలని అన్నారు. వైఎస్‌ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. చంద్రబాబునాయుడు పాల్పడిన సమస్త అక్రమాల మీద విచారణ ఉంటుందని, అప్పుడిక ఈ కుట్రలకు ఫలితం అనుభవించక తప్పదని ఆయన హెచ్చరించారు.
Tags:    

Similar News