వైసీపీ నిరసనలతో అసెంబ్లీ సమావేశాలు మొదలు

Update: 2016-03-05 11:57 GMT
 ఏపీ శాసనసభ సమావేశాలు నిరసనలతో మొదలయ్యాయి. వైసీపీ సభ్యులు నల్ల కండువాలు ధరించి గవర్నర్‌ ప్రసంగానికి హాజరయ్యారు. వైకాపా సభ్యులు శాసనసభ సమావేశాల తొలిరోజునుంచే తమ నిరసనను వ్యక్తం చేస్తూ నల్ల కండువాలు ధరించి రావడంతో సభ మున్ముందు ఎలా ఉండబోతోందన్న అంచనాలు - ఊహాగానాలు మొదలయ్యాయి. ఈసారి వేసవి వేడితో పాటు అసెంబ్లీ వేడి కూడా తారస్థాయిలో ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కాగా గవర్నరు తన ప్రసంగంలో ఏపీ ప్రగతి ప్రణాళికను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని, వచ్చే ఏడాది ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. రాష్ట్రం ఈ ఏడాది రెండంకెల వృద్ధి సాధించిందన్నారు. విద్యుదుత్పత్తి - సరఫరా నష్టాలను వచ్చే ఏడాది సింగిల్ డిజిట్ కు తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వచ్చే బడ్జెట్ లో కాపు కార్పొరేషన్ కు వెయ్యి కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపు - బలిజ - ఒంటరి లకు రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

2018 నాటికి పోలవరం మొదటి దశ పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రం విభజన కష్టాలను ఎదుర్కొంటున్నదని పేర్కొన్న గవర్నర్ విభజన హామీలను కేంద్రం నెరవేర్చాల్సి ఉందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో ఐదున్నర నెలలలోనే పూర్తి చేశామని, రాయలసీమకు 8 టీఎంసీల నీటిని అందించామని చెప్పారు. రూ.70 వేల కోట్ల అంచనాతో జాతీయ రహదారులను ప్రకటించినట్లు గవర్నర్ వివరించారు. రాష్ట్రాన్ని విజ్ణాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ప్రైవేటు వర్సిటీల బిల్లు తీసుకువచ్చామని పేర్కొన్నారు. కేంద్రం మంజూరు చేసిన 5 కేంద్రీయ విద్యాసంస్థలను ప్రారంభించినట్లు చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పేదలకు ప్రతి నెలా పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. 1250 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించినట్లు గవర్నర్ చెప్పారు.
Tags:    

Similar News