కాపు హీటు క‌ల‌వ‌రం పుట్టిస్తోందా?

Update: 2016-03-11 10:52 GMT
తునిలో జరిగిన కాపు గర్జన స‌భ‌కు ముందు, స‌భ త‌ర్వాత చోటుచేసుకున్న ప‌రిణామాల ప‌ట్ల వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చ‌ర్చోపచ‌ర్చ‌లు సాగుతున్నాయి. కాపు గర్జన  పార్టీపరంగా బహిరంగ మద్దతు ఇవ్వ‌డం, స‌భ‌ సందర్బంగా చోటు చేసుకొన్న ఉద్రిక్తత పరిస్థితులు నెల‌కొన‌డం వంటి సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఈ ఎపిసోడ్‌ లో దూకుడుగా వ్య‌వ‌హ‌రించి తప్పుచేశామా అన్న అంతర్మథనం వైసీపీలో మెదలైనట్లు తెలుస్తోంది. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ డిమాండ్ సంద‌ర్భంగా త‌లెత్తిన ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు వైసీపే కారణమని టీడీపీ మొద‌ట్నుంచి టార్గెట్ చేసింది. తాజాగా ఆ పార్టీకి చెందిన కీల‌క నేత భూమ‌న క‌రుణాక‌ర్‌ రెడ్డిపై సీఐడీ ద‌ర్యాప్తు జ‌రుగుతున్న‌ట్లు వార్త‌లు రావ‌డంతో ఆ పార్టీలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. ఇంకోవైపు పార్టీ నేత‌ల్లోనూ అసంతృప్తి మొద‌ల‌వ‌డం ఈ ప‌రిస్థితికి ఆజ్యం పోసిన‌ట్ల‌యింద‌ని చెప్తున్నారు.

ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ ఆర్‌ కాంగ్రెస్ పార్టీయే ఈ ఉద్రిక్తతలను తెరవెనకనుంచి నడిపించిందని పేర్కొంటున్న టీడీపీ నేతలు కాపుల మనోభావాలను గౌరవిస్తున్నామని చెబుతున్నారు. కాపుల‌ను ఎక్కడా తప్పుపట్టకుండా విద్వంసాన్ని - ఉద్య‌మం న‌డిపించిన ముద్ర‌గ‌డ ప‌ద్మానాభంను టార్గెట్ చేసుకొని ముందుకు వెళుతున్నారు. తునిలో రైలు ద‌గ్దం కావ‌డానికి కొద్దిసేపు ముందు ముద్ర‌గ‌డ‌తో భూమ‌న క‌రుణాక‌ర్‌ రెడ్డి మాట్లాడిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చిన ఆధారాలు ఇపుడు క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. రైలు ద‌గ్దంతో త‌మ‌కేమీ సంబంధం లేద‌ని చెప్తూ వ‌చ్చామ‌ని ఇపుడు భూమ‌న అంశం ఆధారాల‌తో స‌హా ముందుకు వ‌చ్చిన క్ర‌మంలో ఏ విధంగా అడుగులు వేయాల‌ని వైసీపీ నాయ‌కులు చ‌ర్చోపచ‌ర్చ‌లు చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా కాపులను బీసీల‌లో చేర్చుతామన్న హామీ అమలుకు ముద్రగడ్డ పద్మనాభం కాపు గర్జనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆయన పిలుపునిచ్చిన మరుక్షణం ఆ గర్జనకు వైసీపీ నేతలు మద్దతు పలికారు. పార్టీలకు అతీతంగా ఈ గర్జనకు మద్దతు పలకాలని కూడా వారు కోరారు. దీంతో తాము కాస్త ఇరకాట పరిస్థితిని ఎదుర్కొంటున్నామని వైసీపీ నేతలే చెప్తున్నారు. కాపు గర్జనకు ఎలాంటి మద్దతు ఇవ్వాలి, ఎలాంటి సహకారం అందించాలన్న దానిపై పార్టీ అంతర్గత వేదికపై సుధీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకొనివుంటే బాగుండేదని వైసీపీ సీనియర్లు కొందరు పేర్కొంటున్నారు.  ఇటు దూకుడు హామీ, అటు ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు తామే కార‌ణ‌మ‌న్న భావ‌న బ‌ల‌ప‌డుతోంద‌ని వైసీపీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.
Tags:    

Similar News