నీలా అనుకుంటే జ‌గ‌న్ ఎప్పుడో సీఎం అయ్యేవాడు

Update: 2017-08-20 10:28 GMT
త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ పై విమ‌ర్శలు చేసిన ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుపై వైసీపీ నేత‌లు మండిప‌డ్డారు. వేర్వేరుగా నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో టీడీపీ తీరుపై విరుచుకుప‌డ్డారు. నంద్యాల ఉప ఎన్నికకు చంద్రబాబే కారణమ‌ని వైఎస్ ఆర్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిప‌డ్డారు. చంద్రబాబు ఒత్తిడి - వేధింపుల వల్లే భూమా నాగిరెడ్డి మరణించార‌ని ఆరోపించారు. వైఎస్ జగన్ నైతిక విలువలను పెంపొందిస్తుంటే...చంద్రబాబు కాలరాస్తున్నారని మేకపాటి అన్నారు. శిల్పాచక్రపాణిరెడ్డితో జగన్ రాజీనామా చేయించారని కానీ చంద్రబాబు 21 మంది ఎమ్మెల్యేలతో ఇంతవరకు రాజీనామా చేయించలేదని ఎంపీ మేక‌పాటి గుర్తు చేశారు. విలువల గురించి చంద్రబాబు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారని ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి తెలిపారు. జిల్లాకో రకంగా ప్రవర్తించడం చంద్రబాబుకు అలవాటని ఎద్దేవా చేశారు. నంద్యాలలో కండువాలు లేకుండా ప్రచారం చేయాలని బీజేపీ నేతలకు చెబుతున్నారని, కాకినాడలో మాత్రం కండువాలు వేసుకోవాలంటున్నార‌ని ఎంపీ మేకపాటి తెలిపారు. చంద్రబాబు వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేద‌ని ఓటుకు కోట్లు కేసు కోసం హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిప‌డ్డారు. ముస్లింలు - దళితులు - కాపులు - బలహీన వర్గాల ప్రజలు ఎప్పుడూ వైఎస్ ఆర్ సీపీ వెంటే ఉంటారని శిల్పామోహన్ రెడ్డి గెలుపు ఖాయమ‌ని మేకపాటి ధీమా వ్య‌క్తం చేశారు.

జగన్ ఏంటో ప్రజలందరికీ తెలుసున‌ని, చంద్రబాబు ఎలాంటి వ్యక్తో చెప్పనవసరం లేదని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. పులివెందులను అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ ఆర్‌ దేన‌ని తెలిపారు. పులివెందుల చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించడమే కాకుండా..అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారని వివ‌రించారు. వైఎస్ వల్లే ఇడుపులపాయకు ట్రిపుల్ ఐటీ వచ్చిందని, 90 శాతం సాగునీటి ప్రాజెక్టులు వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిగతా 10 శాతం పనులు పూర్తి చేయలేని అసమర్థ వ్యక్తి చంద్రబాబు అని అలాంటి చంద్రబాబు పులివెందుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమ‌ని అన్నారు. చంద్రబాబు కండీషన్ కంటే భిన్నంగా పార్టీ పరిస్థితేం లేదని వైఎస్‌ ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. దొంగతనంగా మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని ఆక్రమించుకున్న వ్యక్తి చంద్రబాబు అని ప్రజలను నమ్ముకుని పార్టీ పెట్టి పదవులను వదులుకున్న వ్యక్తి జగన్ అని వివ‌రించారు. ``నీలాగా సీఎం కావాలనుకుంటే జగన్ ఎప్పుడో అయ్యేవాడు. కానీ కుట్రలు - కుతంత్రాలు తెలియవు కాబట్టే పార్టీ పెట్టి పోరాడుతున్నారు. పదవుల కోసం ఏ గడ్డైనా తినేది చంద్రబాబు. ఒక్క జగన్‌ ను ఎదుర్కొనేందుకు 10 మంది మంత్రులు..50 మంది ఎమ్మెల్యేలు - నువ్వు - నీ కొడుకు - నీ బామ్మర్దా..ధనం - కండ కావరం - అధికారం - రిగ్గింగ్‌ తో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరకు వందల కోట్లు పంచి రిగ్గింగ్ చేయాలని చూస్తున్నారు`` అని కొడాలి నాని అన్నారు. మంత్రిగా - ఎమ్మెల్యేగా గతంలో నంద్యాలను అభివృద్ధి చేసింది శిల్పామోహన్‌ రెడ్డేన‌ని అని తెలిపారు. చంద్రబాబు మూడున్నరేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేద‌ని అందుకే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

480 మందిని మర్డర్లు చేయించిన ఘనత చంద్రబాబుదని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ఆరోపించారు.  ఐఏఎస్ రాఘవేంద్రరావు - కాపు నేత వంగవీటి రంగా - జర్నలిస్టు పింగళి దశరథ్‌ ను చంపించింది చంద్రబాబే అని దుయ్య‌బ‌ట్టారు. తాను మర్డర్లు చేయించి ఇతరులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమ‌ర్శించారు. ``కొడుకును మంత్రిని చేసి భూమా కుటుంబాన్ని రోడ్డున పడేశారు ఇంకా నంద్యాలకు వచ్చి చంద్రబాబు నీతులు వల్లిస్తున్నారు. చంద్రబాబుకు మోసాలు - అక్రమాలు - అబద్ధాలు గురించి..నంద్యాల ప్రజలకు బాగా తెలుసు ఉపఎన్నిక ద్వారా కచ్చితంగా చంద్రబాబుకు గుణపాఠం చెబుతారు`` అని ఎమ్మెల్సీ గోపాల్‌ రెడ్డి అన్నారు. కాపుల గొంతు కోసింది చంద్రబాబేన‌ని ఆ విషయాన్ని తాము కాదు.. టీడీపీ ఎమ్మెల్యే బోండానే చెప్పారని వైఎస్ ఆర్సీపీ నేత జోగి రమేష్ అన్నారు. నిరాహారదీక్ష చేస్తున్న వంగవీటి రంగాను..కత్తులు - గొడ్డళ్లతో చంద్రబాబు నరికి చంపించారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్లు ఇస్తాన‌ని హామీ ఇచ్చి ఇప్పుడేమో మంజునాథ నివేదిక రావాలంటున్నార‌ని మండిప‌డ్డారు. ముద్రగడ ఇంటిని జైలుగా మార్చి వేధిస్తున్నారని, అలాంటి పార్టీకి బలిజలు ఓటు వేస్తారా అని జోగిరమేష్ గుర్తు చేశారు. సొంతమామకు వెన్నుపోటు పొడిచి చెప్పులు - కర్రలతో దాడి చేయించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోయిన అవనిగడ్డ - నందిగామ - తిరుపతిలో ఏకగ్రీవానికి మేం సహకరిస్తే.. నంద్యాలలో మాపై చంద్రబాబు పోటీ పెట్టారని జోగిర‌మేష్ మండిప‌డ్డారు. హోల్ సేల్‌ గా అబద్ధాలాడే చంద్రబాబును..నంద్యాల ప్రజలు ఓటు ద్వారా తరిమి కొడతారని జోగిరమేష్ అన్నారు.
Tags:    

Similar News