వైసీపీ స్కెచ్‌ ..టార్గెట్ ప‌వ‌న్‌

Update: 2016-10-30 09:53 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో రాజ‌కీయం మ‌రింత రంజుగా మారుతోంది. వివిధ అంశాల‌పై వేగంగా స్పందిస్తూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా తన పాత్రను పూర్తిస్థాయిలో నిర్వహించుకొంటూ ముందుకెళ్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఇప్పుడు జనసేన రంగంలోకి దిగనుండటంతో తన వ్యూహంను మార్చుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్య‌ జనసేన పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీడీపీతో జతకట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారి కలయిక మున్ముందు తనకు సవాల్‌ గా మారకూడదన్న దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఏ ఆందోళనకు పిలుపునిచ్చినా ఆయన స్వతహాగా పాల్గొన్న చోటే యువత సమీకరణ సాగుతుందని, మిగితా చోట్ల ఆయన పార్టీకి క్యాడర్‌ లేకపోవడం - ప్రభావితం చేసే నేతలు లేకపోవడం వల్ల దానికి జనం మద్దతు అంతంత మాత్రమే ఉంటుందని వైసీపీ పేర్కొంటోంది. త‌మ పార్టీ చేపట్టే ప్రతి ఆందోళనకు జనం నుంచి మంచి స్పందన వస్తుందని, ఈ పరిస్థితుల్లో ఆందోళనల విషయంలో జనసేన కంటే ఒక అడుగు ముందుండేలా తాము జాగ్రత్తలు తీసుకొంటున్నామని వైసీపీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపున‌కు కృషిచేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్రంలోని అధికార టీడీపీ పాలనపై పెద్ద‌గా విమ‌ర్శ‌లేవీ చేయ‌డం లేదు. ఏపీ ప్ర‌భుత్వంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాన్‌ తీవ్రస్థాయిలో విమర్శలకు దిగకపోవడంతో ఆయనకు ప్రత్యేకహోదా - విభజన బిల్లు హామీలే ప్రధాన అస్త్రాల‌ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో తన పార్టీ ఉనికి కోసం పవన్‌ కళ్యాణ్‌ ఈ అంశాలపైనే ఉద్యమాలు చేయాల్సి ఉండటంతో ఆ విషయాలలో తాము ఓ అడుగు ముందుకేస్తే జనం మద్దతు తమకే పదిలంగా ఉంటుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. అనంతపురంలో ఓ సభను ఏర్పాటుచేసిన జనసేన పార్టీ ఆ సభలో ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని కీలకంగా తీసుకొని తన గర్జనను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలులో జరిగిన యువభేరీ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి ప్రత్యేకహోదా కోసం అవసరమైతే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వెల్లడించిన విషయం తెలిసిందే. తద్వారా ఏపీకి ప్రత్యేకహోదా అంశంలో తనదే పైచెయ్యి అని చాటిచెప్పే యత్నం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి.

ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ  తన రీఎంట్రీ ప్రారంభించడం, పూర్తిస్తాయిలో ఆ పార్టీ ఒక్కటే ఎన్నికలను ఎదుర్కోలేదని రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది. ప‌వ‌న్‌ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం ఇంతవరకు తెరపైకి రాకపోవడం, ఆయన పార్టీలోకి మున్ముందు ఎవరు వెళ్తారు అన్నది స్పష్టత రాకపోవడం వంటి పరిణామాలలో జనసేన పార్టీ ఏదో ఒక పార్టీతో కలసివెళ్లే అవకాశాలే ఎక్కువ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకున్న క్షేత్రస్థాయి క్యాడర్‌ వల్ల వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం కృషిచేస్తే తమకే అవకాశాలు మెండుగా ఉంటాయని వైసీపీ పేర్కొంటోంది. ఒకవేళ టీడీపీ-జ‌న‌సేన‌ పార్టీలు కలిస్తే ఈ ఎన్నికలు కాస్త తమకు సవాల్‌గా మారుతాయని, అయినా దానిని అధిగమించే సత్తా తమకు ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం జనసేన పార్టీ వ్యవహారాలపై దృష్టిపెట్టినట్లు సమాచారం. ఏ ఆందోళనకు జనసేన పార్టీ పిలుపునిచ్చినా తనకున్న నాయకత్వ పట్టిమతో వాటి విషయంలో ఒక్కడుగు తానే ముందుకేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. తన పార్టీకి ఎంపీ - ఎమ్మెల్యే - ఎమ్మెల్సీల బలముండటం - క్షేత్రస్థాయిలో పార్టీకి నాయకత్వం ఉండటం ఇవన్నీ తమకు బాగా కలిసివ‌స్తాయని వారు పేర్కొంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News