కీల‌క‌మైన ఆ జిల్లాలో మంత్రి వ‌ర్సెస్ జెడ్పీ చైర్మ‌న్‌!

Update: 2022-08-31 06:45 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కీల‌క‌మైన కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీలో ఓ మంత్రికి, జెడ్పీ చైర్మ‌న్‌కు మ‌ధ్య ప‌డ‌టం లేద‌నే వార్త‌లు ఆ పార్టీ అధిష్టానానికి ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని చెబుతున్నారు. జిల్లా ప‌రిష‌త్ సీఈవో విష‌యంలో గృహ‌నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌, జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ఉప్పాల హారిక మ‌ధ్య విభేదాలు చోటు చేసుకున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. వీరిద్ద‌రూ ఒకే పార్టీ కావ‌డం, అందులోనూ ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు కావ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.. జోగి ర‌మేష్. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తోపాటు వైఎస్సార్సీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును అసెంబ్లీలోనే బూతులు తిట్ట‌డంతోపాటు ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు ఇంటిపైకి భారీ కాన్వాయ్‌తో దాడికి వెళ్లి జోగి ర‌మేష్.. సీఎం జ‌గ‌న్ దృష్టిలో ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌కు రెండో విడ‌త మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో గృహ‌నిర్మాణ శాఖ మంత్రిగా జ‌గ‌న్ చాన్స్ ఇచ్చారు.

కాగా పెడ‌న‌లో 2014లో ఉప్పాల రాంప్ర‌సాద్ వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈయ‌న వైఎస్సార్సీపీ ఏర్పాటు నుంచి పార్టీలో కొన‌సాగుతున్నారు. జోగి ర‌మేష్‌ది పెడ‌న అయిన‌ప్ప‌టికీ 2014లో మైల‌వ‌రం నుంచి వైఎస్సార్సీపీ పోటీ చేయించింది. ఆ ఎన్నిక‌ల్లో దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుపైన జోగి ర‌మేష్ ప‌రాజ‌యం పాల‌య్యారు. అటు జోగి ర‌మేష్, ఉప్పాల రాంప్ర‌సాద్ ఇద్ద‌రూ గౌడ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే. అయితే 2019లో జోగి ర‌మేష్ పెడ‌న నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో ఉప్పాల రాంప్ర‌సాద్ కోడ‌లు ఉప్పాల హారిక‌కు జెడ్పీ చైర్మ‌న్‌గా చాన్స్ ఇచ్చారు.

ప్ర‌స్తుతం ఉప్పాల హారిక‌, జోగి ర‌మేష్ ఇద్ద‌రూ పెడ‌న నుంచే త‌మ రాజ‌కీయ కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కృష్ణా జిల్లా జెడ్పీ సీఈవో వ్య‌వ‌హారం వీరిద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ భేదాల‌కు దారితీసింద‌ని అంటున్నారు. జెడ్పీ సీఈవోగా నందిగామ ఎంపీడీవోగా ఉన్న సుశీల‌ను జోగి ర‌మేష్ త‌న సిఫార‌సుల‌తో నియ‌మించుకున్నారు. ఈ మేర‌కు ఆగ‌స్టు 13న ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. అయితే త‌న ప‌రిధిలోకి వ‌చ్చే అంశంలో త‌న అనుమ‌తి లేకుండా జెడ్పీ సీఈవోను ఎలా నియ‌మిస్తార‌ని హారిక వైఎస్సార్సీపీ అధిష్టానం వ‌ద్దే అభ్యంత‌రం వ్య‌క్తం చేశారని స‌మాచారం. దీంతో ప్ర‌స్తుతానికి జెడ్పీ సీఈవో నియామ‌కం నిలిచిపోయింది. రెండు నెల‌ల నుంచి కృష్ణా జిల్లా జెడ్పీ సీఈవో పోస్టు నాయ‌కుల మ‌ధ్య అభిప్రాయ భేదాల‌తో ఖాళీగా ఉంద‌ని తెలుస్తోంది.

గ‌తంలో జిల్లా ప‌రిష‌త్ ఏవోగా ప‌నిచేసిన సీనియ‌ర్ ఎంపీడీవో వీర్ల జ్యోతిబ‌సును జెడ్పీ సీఈవోగా నియ‌మించాల‌ని ఉప్పాల హారిక సిఫార్సు చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫైలు సీఎంవో వ‌ద్ద పెండింగ్‌లో ఉంద‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల వైఎస్సార్ నేత‌న్న నేస్తం నిధుల విడుద‌ల‌కు సీఎం జగన్‌ పెడనలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ ఉప్పాల హారిక వ‌ర్గీయులు భారీగా ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు కట్టారు. అయితే వీటిని జోగి ర‌మేష్ తొల‌గింప‌జేశార‌ని చెబుతున్నారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని తెలుస్తోంది.  

ఈ నేప‌థ్యంలో మంత్రి జోగి ర‌మేష్.. సీఈవోగా సుశీల‌కు పోస్టు ఇప్పించ‌డం వెనుక‌ జరిగిన పరిణామాలు, భారీ ఎత్తున ముడుపులు పుచ్చుకోవ‌డం తదితర అంశాలపై జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ హారిక‌ నేరుగా మఖ్యమంత్రికే  ఫిర్యాదు చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో సుశీలను జెడ్పీ సీఈవోగా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులును నిలిపివేశారు.

హారిక‌, జోగి ర‌మేష్ ఇద్దరూ గౌడ‌ సామాజికవర్గానికి చెందిన వారైనప్పటికీ మంత్రి జోగి రమేష్‌ తనదైన శైలిలో ఉప్పాల కుటుంబాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జెడ్పీ నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఆయా మండలాల్లో, ముఖ్యంగా పెడన మండలంలో అనుమతులు ఇవ్వకుండా మంత్రి అడ్డు త‌గులుతున్నార‌ని హారిక భ‌గ్గుమంటున్నార‌ని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News