జ‌న‌సేన‌లోకి ఆ వైఎస్సార్సీపీ మాజీ మంత్రి.. నిజ‌మెంత‌?

Update: 2022-08-10 06:40 GMT
జ‌న‌సేన పార్టీలో ప్ర‌కాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల వైఎస్సార్సీపీ కోఆర్డినేట‌ర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి చేర‌తార‌నే వార్త కొద్ది రోజులుగా హ‌ల్చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వైఎస్ జ‌గ‌న్ రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కొంత‌మంది మంత్రుల‌ను తొల‌గించి కొత్త‌వారికి అవ‌కాశ‌మిచ్చారు. అలాగే పాత మంత్రుల్లో ఏకంగా 11 మందిని రెండోసారీ కొన‌సాగించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌కాశం జిల్లాలో మంత్రులుగా ఉన్న ఇద్ద‌రిలో బాలినేని శ్రీనివాస‌రెడ్డిని తొల‌గించి.. ఆదిమూల‌పు సురేష్ ను కొన‌సాగించారు.

త‌న‌ను త‌ప్పించి ఆదిమూల‌పు సురేష్ ను కొన‌సాగించ‌డంపై బాలినేని అప్ప‌ట్లోనే గ‌ట్టిగా అభ్యంత‌రం వ్య‌క్తం చేశార‌నే గాసిప్స్ వినిపించాయి. తొల‌గిస్తే ఇద్దరినీ తొలగించాల్సిందేన‌ని చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో చివ‌రి వ‌ర‌కు ఆదిమూల‌పు సురేష్ పేరు రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో వినిపించ‌లేదు. ఎట్ట‌కేల‌కు చివ‌ర‌లో మాత్ర‌మే ఆదిమూల‌పు మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్నారు.

అప్ప‌టి నుంచి బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని.. వైఎస్సార్సీపీకి గుడ్ బై చెబుతార‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆ అసంతృప్తిని పోగొట్ట‌డానికే ఆయ‌న‌కు ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల కోఆర్డినేట‌ర్ గా సీఎం జ‌గ‌న్ పార్టీ బాధ్య‌త‌లు అప్పగించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ప్ప‌టికీ బాలినేని మాత్రం అసంతృప్తిగానే ఉన్నార‌ని.. త‌న‌ను త‌ప్పించి త‌న జిల్లాలో ఆదిమూల‌పు సురేష్ ను కొన‌సాగించ‌డాన్ని అవ‌మానంగా భావిస్తున్నార‌ని చెప్పుకున్నారు.

ఈ ప‌రిణామాల‌కు తోడు ఇటీవ‌ల జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్బంగా బాలినేనికి ట్విట్ట‌రులో స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. చేనేత దుస్తులు ధ‌రించి పోస్టు చేయాల‌ని ప‌వ‌న్ విసిరిన చాలెంజ్ కు బాలినేని స్పందించారు. చేనేత వ‌స్త్రాలు ధ‌రించి ట్విట్ట‌రులో ప‌వ‌న్ కు రిప్లై ఇచ్చారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ముగ్గురికి ఈ చాలెంజ్ విస‌ర‌గా కేవ‌లం బాలినేనే స్పందించారు. చంద్ర‌బాబు, బీజేపీ నేత లక్ష్మ‌ణ్ స్పందించ‌లేదు.

దీంతో బాలినేని శ్రీనివాస‌రెడ్డి జ‌న‌సేన‌లో చేరుతున్నార‌నే గాసిప్స్ వినిపించాయి. వైఎస్సార్సీపీ పైన అసంతృప్తితో ఉన్న బాలినేని జ‌న‌సేన‌లో చేరిక‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని గాసిప్స్ ప్ర‌చారం చేశారు. వీటిపై బాలినేని శ్రీనివాస‌రెడ్డి తాజాగా స్పందించారు. తాను చివ‌రి వ‌ర‌కు వైఎస్సార్సీపీలోనే కొన‌సాగుతాన‌ని తేల్చిచెప్పారు. త‌న‌పై కొన‌సాగుతున్న అస‌త్య ప్ర‌చారాన్ని సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్తాన‌న్నారు.

జ‌న‌సేన‌తో ట‌చ్ లో ఉన్న ప్ర‌చారం అబ‌ద్ధం అని ఆయ‌న ఖండించారు. ఊస‌ర‌వెల్లి రాజ‌కీయాలు తాను చేయ‌న‌ని.. ఉంటే వైఎస్సార్సీపీలో ఉంటాన‌ని.. లేదంటే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని బాలినేని తేల్చిచెప్పారు.
Tags:    

Similar News