వేడి పుట్టించనున్న మంత్రుల బస్సు యాత్ర

Update: 2022-05-19 04:17 GMT
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న సామాజికన్యాయం, అమలుచేస్తున్న సంక్షేమ పథకాల తీరును వివరించేందుకు మంత్రుల ఆధ్వర్యంలో బస్సుయాత్ర మొదలవ్వబోతోంది. ఈనెల 26వ తేదీనుండి 29వ తేదీవరకు నాలుగు ప్రాంతాల్లో బస్సుయాత్రలు చేయటం, ఇదే సమయంలో నాలుగు ప్రాంతాల్లో బహిరంగసభలు నిర్వహించాలని జగన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డిసైడ్ అయ్యింది.

మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు, ఎంపీ, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలతో నాలుగురోజుల యాత్ర మొదలవుతుంది. శ్రీకాకుళం లేదా విజయనగరం జిల్లాలో యాత్ర మొదలవుతుంది. ఇక్కడే ఒకచోట బహిరంగసభ కూడా జరుగుతుంది. ఒకరోజు జిల్లాలో బహిరంగసభ తర్వాత బస్సుయాత్రలో నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్, మండల కేంద్రాలను కూడా యాత్ర టచ్ చేస్తుంది.

గడచిన మూడేళ్ళుగా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, పై వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తదితర అంశాలను హైలైట్ చేయటానికే బస్సుయాత్ర జరుగుతోంది.

27వ తేదీన రాజమండ్రి, 28న నరసరావుపేట, 29వ తేదీన అనంతపురంలో బహిరంగసభలు  జరగబోతున్నాయి. పై వర్గాలకు సంబంధించి చంద్రబాబునాయుడు హయాంలో ఇచ్చిన ప్రాధాన్యత, జగన్ హయాంలో ఇస్తున్న, భవిష్యత్తులో ఇవ్వబోతున్న ప్రాధాన్యతలను వివరించటమే బస్సుయాత్ర ముఖ్యఉద్దేశ్యమని సమాచారం.

బస్సుయాత్రతో రాజకీయ వేడి మరింతగా పెరిగిపోవటం ఖాయమని అర్ధమైపోతోంది. ఎలాగంటే ఇప్పటికే పథకాలఅమలు పేరుతో జగన్ ఆరుజిల్లాల్లో బహిరంగసభల్లో పాల్గొన్నారు. అలాగే గడప గడపకు వైసీపీ కార్యక్రమం జరుగుతోంది. ఇదే సమయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతోంది.

దీనికి అదనంగా టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయాలని పిలుపిచ్చారు. ఇక ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతులను ఆర్ధికంగా ఆదుకునే కారణంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడుజిల్లాల్లో పర్యటించారు. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుండగానే రాష్ట్రంలో రాజకీయ వేడి మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. మరి బస్సుయాత్ర రగిలించబోయే వేడి ఏ స్ధాయిలో ఉంటుందో చూడాల్సిందే.
Tags:    

Similar News