అత్యంత మెజారిటీ వ‌చ్చిన వైసీపీ ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గంలో అంత అవినీతా!

Update: 2020-01-31 09:30 GMT
ఏపీలో గ‌త ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున భారీ మెజారిటీతో నెగ్గిన వారిలో గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఒక‌రు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ర్వాత అత్య‌ధిక మెజారిటీ ద‌క్కింది అన్నా రాంబాబుకే. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి అత్యంత అనుకూల‌మైన స‌మీక‌ర‌ణాలు ఉన్న నేప‌థ్యంలో.. జ‌గ‌న్ గాలిలో ఆయ‌న‌కు ఆ మెజారిటీ ద‌క్కింది. ఆ ముచ్చ‌టంతా బాగానే ఉంది కానీ, ఇప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక మరుగుదొడ్ల స్కామ్ ఒక‌టి వెలుగు చూసిన వైనం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంది.

అర్ధ‌వీడు మండ‌లంలో ప‌ల్లెల్లో లెట్రిన్ రూమ్ లు క‌ట్ట‌డానికి సంబంధించి ఒక కుంభ‌కోణం జ‌రిగిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. దాదాపు 70 ల‌క్ష‌ల రూపాయ‌ల స్కామ్ ఇది అని స‌మాచారం. ప‌ల్లెల్లో మ‌రుగుదొడ్లు క‌ట్టించ‌డానికి అంటూ.. గుంత‌లు త‌వ్వి, తీరా అవి క‌ట్ట‌కుండానే బిల్లులు డ్రా చేసేసిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఊర్ల‌లో ఇంకా మ‌రుగుదొడ్లు లేని వారి ఇళ్ల‌ను ఎంపిక చేసి.. వారికి బాత్ రూమ్ లు క‌ట్టిస్తామ‌ని చెప్పార‌ట‌. ఆ మేర‌కు గుంత‌లు తీయించారు. అంత‌టితో ఖేల్ ఖ‌తం.

ఆ త‌ర్వాత అధికారులు కానీ, నేత‌లు కానీ వాటిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. అదేమంటే.. ఇప్ప‌టికే ఆ మ‌రుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదల అయిపోయింద‌ట‌, ల‌బ్ధిదారుల‌కు కూడా ఆ నిధులు చేరిన‌ట్టుగా అధికారులు చెబుతున్నార‌ట‌. కానీ త‌మ‌కు డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని, డ‌బ్బులు ఇచ్చి ఉంటే మ‌రుగుదొడ్ల నిర్మాణాలు పూర్త‌య్యేవ‌ని ల‌బ్ధిదారులు అంటున్నారు. త‌మకు మోసం చేశార‌ని వారు చెబుతున్నారు.

ల‌బ్ధిదారులు నిధులు డ్రా చేసుకున్న‌ట్టుగా అధికార ప‌త్రాలు చెబుతున్నాయి - ల‌బ్ధిదారులేమో త‌మ‌కు రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని, దీంతో తాము తవ్విన గుంత‌ల‌ను కూడా పూడ్చేసుకున్న‌ట్టుగా వారు చెబుతున్నారు. ఇంత‌కీ మ‌ధ్య‌లో ఎవ‌రు డ‌బ్బులు తినేశారు? అనేది ప్ర‌శ్నార్థ‌కం.  ఆఖ‌రికి మ‌రుగుదొడ్ల డ‌బ్బుల‌ను ఇలా అడ్డంగా దోచేశార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యంలో జ‌వాబుదారీగా ఉండాల్సిన అధికారులు.. అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది.

    

Tags:    

Similar News