జగన్ కు ఝలక్ ఇచ్చిన మరో ఎమ్మెల్యే

Update: 2016-03-01 10:05 GMT
రాయలసీమ ప్రాంతంలో మొదలై కోస్తాలోని ప్రకాశం జిల్లాకు పాకిన వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల ఉప్పెన ఇప్పుడు ఉత్తరాంధ్రనూ తాకింది. కొద్దికాలంగా టీడీపీతో సన్నిహితంగా ఉంటున్న వైసీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అసలు విషయం ప్రకటించేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆయనపై కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే... అందరిలా ఆయన ఆ వార్తలను ఖండించడం లాంటివేమీ చేయకుండా మౌనంగా ఉన్నారు. తాజాగా మంగళవారం ఆయన వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించేశారు. దీంతో జగన్ కు మారో దెబ్బ తగిలినట్లయింది. జగన్ ప్రధానంగా దృష్టి పెట్టిన కాపు వర్గానికి చెందిన నేతకావడంతో రెండు రకాలుగా నష్టం కలిగినట్లయింది.

పాతపట్నం ఎమ్మెల్యే వెంకటరమణ తాను టీడీపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. తన తండ్రి మోహన్‌ రావుతో కలిసి పార్టీని వీడుతున్నట్టు చెప్పారు. వెంకటరమణలో గతంలో టీడీపీలో పనిచేశారు.  పదేళ్లపాటు టీడీపీలో ఉన్నారు.  కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనూ అప్పట్లో టీడీపీని వీడాల్సి వచ్చిందని... ఈ నెల 4వ తేదీన కార్యకర్తలతో కలిసి టీడీపీలో చేరుతానని రమణ ప్రకటించారు. కాగా ఉత్తరాంధ్రలో మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలూ టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళంలో మొత్తం ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉండగా వెంకటరమణ నిష్క్రమణతో వారి సంఖ్య రెండుకు తగ్గుతోంది. ఆ ఇద్దరిలోనూ ఒకరు ఒకప్పుడు టీడీపీలో ఉన్న నేతే కావడంతో మళ్లీ పాత గూటికి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. విజయనగరంలోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఉత్తరాంధ్రలో జగన్ పార్టీ దాదాపుగా ఖాళీ అవుతుంది.
Tags:    

Similar News