వైఎస్సార్ కాంగ్రెస్ సహనానికి హేట్సాఫ్!

Update: 2017-11-08 23:30 GMT
ఈ పని ఖచ్చితంగా అయ్యేది కాదు.. అని వారందరికీ చాలా స్పష్టంగా తెలుసు. అయినా సరే.. చాలా ఓపికగా సహనంగా ఆ పనిచేశారు. పని జరుగుతున్నంతసేపూ లోలోపల కుతకుత ఉడుకుతూనే ఉంటారు.. కడుపుమంట వారిని కలచివేస్తుంటుంది. కానీ పైకి మాత్రం చట్టసమ్మతంగా ఎంత మేరకు వ్యవహరించాలో, ఆ పరిధి మించకుండానే వ్యవహరించారు.

ఈ ఉపోద్ఘాతం మొత్తం దేని గురించా అనుకుంటున్నారు కదూ.. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు.. బుధవారం నాడు స్పీకరును కలిసి ఫిర్యాదు చేసిన వ్యవహారానికి సంబంధించిన ఎపిసోడ్ ఇది. తమ పార్టీనుంచి రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి.. పార్టీ ఫిరాయించి.. అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయిన నేపథ్యంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం ఏపీ స్పీకరు కోడెల శివప్రసాదరావును కలిసి ఫిర్యాదు చేశారు. వంతల రాజేశ్వరిపై అనర్హత వేటు వేయాలని వారు డిమాండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలపై వేటు వేయడం అనేది అంత సులువైన విషయమేనా? అసలిది సాధ్యమవుతుందా? అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది? ఎందుకంటే.. తెలుగుదేశం పార్టీ  అధికారంలోకి వచ్చిన నాటినుంచి విపక్షాన్ని వెన్నుపోటు పొడవడం మీదనే ధ్యాస పెడుతోంది. ఆ పార్టీ టికెట్ మీద గెలిచిన వారిని రకరకాల ప్రలోభాలు, బెదిరింపులతో తమ పార్టీలో కలిపేసుకోవడం గురించి వారు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మొన్న మొన్నటిదాకా 21 మందిని వైకాపానుంచి తమలో కలిపేసుకున్నారు. ఆ రకంగా రాజ్యాంగ విలువల్ని.. తుంగలోతొక్కారు. పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకుని , సంబంధిత చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని వైకాపా ఎమ్మెల్యేలు స్పీకరును కోరుతూనే ఉన్నారు. ఫలితం లేదు. న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. న్యాయమూర్తి నుంచి వచ్చిన సూచనలకు అసెంబ్లీనుంచి స్పందన లేదు. స్పీకరును మళ్లీ మళ్లీ పలుమార్లు కలిసి ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకునే దిక్కులేదు. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా నడుస్తూనే ఉంది. స్పీకరు తమ ఫిర్యాదుల పట్ల స్పందించరు అనే విశ్వాసం వారికి పరిపూర్ణంగా ఉంది.

అయినా సరే.. తమ పని తాము చేయాల్సిందే. జరుగుతున్న అక్రమాన్ని ప్రజలు గుర్తించాల్సిందే. అధికారాన్ని అడ్డు పెట్టుకుని విపక్షాన్ని దెబ్బకొట్టడానికి ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో అన్నిటినీ వారు సహిస్తున్నారు. తాజాగా 22 వ ఎమ్మెల్యే ఫిరాయించినా కూడా.. దీనిపై ఎలాంటి చర్యలు ఉండవని తెలిసినా కూడా.. వెళ్లి ఫిర్యాదు చేశారంటే.. వారి సహనాన్ని పొగడాల్సిందే.
Tags:    

Similar News