ఇలా చేస్తే జ‌గ‌న్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు ర‌జ‌నీ!

Update: 2019-06-13 06:59 GMT
ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రోజు నుంచే ప్ర‌తి విష‌యంలోనూ ఆచితూచి అన్న‌ట్లుగా నిర్ణ‌యాలు తీసుకుంటున్న జ‌గ‌న్‌.. త‌న పార్టీ నేత‌లు బాధ్య‌త‌గా ఉండాలంటూ త‌ర‌చూ చెబుతూనే ఉన్నారు. వివాదాల‌కు దూరంగా ఉండ‌టం.. తొంద‌ర‌పాటు చ‌ర్య‌ల‌కు పోకూడ‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్న ఆయ‌న త‌న ఎజెండాను ఓపెన్ గా చెప్పేస్తున్నారు. మొన్న‌టికి మొన్న జ‌రిగిన కాబినెట్ భేటీలో మాట్లాడుతూ.. మంత్రుల మీద ఆరోప‌ణ‌లు వ‌స్తే ప‌ద‌వి నుంచి పీకేస్తానంటూ ఆయ‌న చేసిన హెచ్చ‌రిక తెలిసిందే.

ఇలాంటి వేళ‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి. అందుకు భిన్నంగా అతి వేగంతో కారుతో దూసుకెళ్లి బైక్ ను ఢీ కొన్న వివాదంలో చిలక‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ చిక్కుకున్నారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు చిల‌క‌లూరిపేట నుంచి అతి వేగంతో వ‌స్తున్న ఎమ్మెల్యే వాహ‌నం ఒక బైక్ ను ఢీ కొంది. మంగ‌ళ‌గిరి మండ‌లం నిడ‌మ‌ర్రు చార్వాక ఆశ్ర‌మం స‌మీపంలో ఈ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

ఈ ఘ‌ట‌న‌లో యువ‌కుడికి గాయాలు అయ్యాయి. స్థానికుల సాయంతో యువ‌కుడ్ని ఆటోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఎమ్మెల్యే త‌న దారిన తాను అసెంబ్లీకి వెళ్లిపోగా.. ఆమె స‌హాయ‌కుడు గాయ‌ప‌డిన యువ‌కుడ్నిఆసుప‌త్రికి చేర్చారు. ప్ర‌స్తుతం అత‌డి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని అంటున్నారు. స్థానికుల క‌థ‌నం ప్ర‌కారం ఎమ్మెల్యే వాహ‌నం మితిమీరిన వేగంతో వ‌చ్చింద‌ని చెబుతున్నారు. ఇలాంటి తీరును జ‌గ‌న్ ఒప్పుకోర‌ని.. ఈ త‌ర‌హా వివాదాల్లో చిక్కుకుంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారంటూ స్థానికులు మాట్లాడుకోవ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News