ద‌ర్శ‌నంపై రోజా ప్ర‌శ్న‌లతో బాబుకు త‌ల‌నొప్పులు

Update: 2018-07-16 06:49 GMT
టీటీడీ చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా తొమ్మిది రోజుల పాటు స్వామి వారి ద‌ర్శ‌నానికి భ‌క్తుల్ని అనుమ‌తించ‌కుండా టీటీడీ పాల‌క‌మండ‌లి తీసుకున్న నిర్ణ‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. పన్నెండేళ్ల‌కుఒక‌సారి జ‌రిగి మ‌హా సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మం గతంలో జ‌రిగినా.. ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల్ని అనుమ‌తించేవారు.

తాజా ఉదంతంలో మాత్రం మొత్తం గుడిని మూసేయాల‌నుకోవటం.. భ‌క్తుల్ని అస్స‌లు అనుమ‌తించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించ‌టం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌హా సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మం ఉన్న‌ప్ప‌టికీ.. భ‌క్తుల్ని ప‌రిమిత సంఖ్య‌లో అనుమ‌తిస్తే కొంప‌లు ఏమీ మున‌గవ‌ని.. కానీ.. అధికారులు గుట్టుగా ఆల‌యంలో ఏదో చేద్దామ‌నే నేపం మీద‌నే ఇన్నేసి రోజుల పాటు భ‌క్తుల్ని ఆల‌యంలోకి రానివ్వ‌టం లేద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే తిరుమ‌ల పుణ్య‌క్షేత్రంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. పోటులో త‌వ్వ‌కాలు జ‌రిపిన‌ట్లుగా ర‌మ‌ణ‌దీక్షితులు ఆరోపించ‌టం తెలిసిందే.  ఆయ‌న ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరుస్తూ అక్క‌డి సీసీ కెమేరాలు ప‌ని చేయ‌టం లేద‌న్న మాట తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో  ర‌మ‌ణ‌దీక్షితులు చేసిన కొన్ని అభియోగాల‌పై స‌రికొత్త రీతిలో వ‌స్తున్న స‌మాధానాలు ఈ విష‌యంపై అంత‌కంత‌కూ అనుమానాలు బ‌ల‌ప‌డేలా ఉన్నాయి. తాజాగా ఈ ఇష్యూపై ఏపీ విప‌క్ష పార్టీ క‌మ్‌ ఫైర్ బ్రాండ్.. మ‌హిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా గ‌ళం విప్పారు. ఎప్పుడూ లేని విధంగా స్వామి వారి ఆల‌యంలో తొమ్మిది రోజుల పాటు భ‌క్తులు అనుమ‌తించ‌మని టీటీడీ అధికారులు చేస్తున్న వ్యాఖ్య‌లు అనుమానాల‌కు తావిచ్చేలా ఉన్నాయ‌న్నారు.

ర‌మ‌ణ దీక్షితులు టీటీడీపై చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మే అన్న భావ‌న‌కు టీటీడీ అధికారుల తీరు ఉంద‌న్నారు. పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కు టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి అప్ప‌గించిన నాటి నుంచి ఏవో ఒక ఆరోప‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతూనే ఉన్నాయ‌ని మండిప‌డ్డారు. టీటీడీ తీరు పైన రోజా చేసిన విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు ఏపీ అధికార‌ప‌క్షానికి కొత్త క‌ష్టాన్ని తెచ్చి పెడ‌తాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News