కీలకమైన నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే వారసుడి హంగామా!

Update: 2022-11-15 23:30 GMT
పల్నాడు జిల్లాలో వినుకొండ నియోజకవర్గం కీలకం. ఇటు గుంటూరు జిల్లా రావడానికి, అటు రాయలసీమ జిల్లాలకు వెళ్లడానికి, మరోవైపు ప్రకాశం జిల్లా వెళ్లడానికి వినుకొండను ముఖ ద్వారంగా భావిస్తారు.

అలాంటి కీలక నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నారు. ఆయనకు తిరుమల డెయిరీ, తిరుమల ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. మిల్క్‌ తయారీ సంబంధిత పరిశ్రమలు కూడా నిర్వహిస్తున్నారు. వీటిని ఇటీవల వరకు బొల్లా బ్రహ్మనాయుడు కుమారుడు బొల్లా గిరిబాబు చూసుకునేవారు.

అయితే ఇప్పుడు ఆయన తన తండ్రితోపాటు రాజకీయంగా చురుగ్గా తిరుగుతుండటం నియోజకవర్గంలో ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చురుగ్గా తిరుగుతున్నారు. అయితే ఆయనతోపాటు ఆయన కుమారుడు బొల్లా గిరిబాబు సైతం వస్తున్నారు.

2009లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ నుంచి ఓడిపోయారు. ఇక 2014లో వైసీపీ తరఫున పెదకూరపాడు నుంచి పోటీ చేసినా ఓటమి తప్పించుకోలేకపోయారు. 2019లో మళ్లీ నియోజకవర్గం మార్చుకుని వైసీపీ తరఫున వినుకొండలో గెలిచారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయరని.. తనకు బదులుగా తన కుమారుడు గిరిబాబును పోటీ చేయిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో గిరిబాబు యాక్టివ్‌ అయ్యారని సమాచారం. అయ్యప్ప స్వాములకు భోజనాలు పెట్టించడం, వారికి భజన కార్యక్రమాలకు విరాళాలు అందజేయడం వంటివి చేస్తూ వారిని ఆకట్టుకుంటున్నారని చెబుతున్నారు.

అదేవిధంగా ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో వన భోజనాల పేరుతోనూ గిరిబాబు ప్రజలకు చేరువ అవుతున్నారు. మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బొల్లా బ్రహ్మనాయుడు ఒకచోట, ఇంకో చోట ఆయన కుమారుడు గిరిబాబు తిరుగుతున్నారు.

ఇలా నిత్యం తండ్రీకొడుకులు ప్రజలకు ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటున్నారని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బొల్లా గిరిబాబు వచ్చే ఎన్నికల్లో వినుకొండ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారని అంటున్నారు.

అయితే మరోవైపు వారసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోనని ఇప్పటికే వైఎస్‌ జగన్‌ ప్రకటించారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలే పోటీ చేయాలని వైఎస్‌ జగన్‌ చెప్పినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో మరి గిరిబాబుకు అవకాశం దక్కుతోందో, లేదో వేచిచూడాల్సిందే. ఎన్నికల నాటికి జగన్‌కు ఏదోలా నచ్చజెప్పి తన కుమారుడిని తనకు బదులుగా బరిలోకి దించాలని బ్రహ్మనాయుడు నిర్ణయించుకున్నట్టు ప్రచారం సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News