అమ్మో.. ఆయన చాంబరా! వేరేది కేటాయించండి సార్

Update: 2019-06-13 04:13 GMT
రాజకీయాల్లో సెంటిమెంట్లుకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఇప్పుడు వైసీపీ మంత్రులు కూడా అలాంటి సెంటిమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. ముఖ్యంగా మంత్రుల్లో చాలామంది తొలిసారి మంత్రులు కావడంతో తమ పదవికి, పనితీరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అన్ని అంశాలనూ బేరీజు వేసుకుంటున్నారట. చాంబర్ల విషయంలోనూ మంత్రులంతా పట్టింపుగా ఉన్నట్లు తెలుస్తోంది. తమకు ఫలానా చాంబర్ కావాలని ఎవరూ కోరకపోయినా.. ఫలానా చాంబర్ మాత్రం వద్దని అంటున్నారట. ఇంతకీ.. మంత్రులంతా ముక్తకంఠంతో వద్దని చెప్పేసిన ఆ ఫలానా చాంబర్ ఏదో తెలిస్తే షాకవ్వాల్సిందే. అది.. ఇంకెవరిదో కాదు.. మాజీ మంత్రి నారా లోకేశ్ చాంబర్.

లోకేశ్ స్వయానా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు. భవిష్యత్ ముఖ్యమంత్రని తెలుగుదేశం పార్టీ కలలు కన్న నాయకుడు. కానీ.. లోకేశ్ మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. అదే ఆయనకు మొట్టమొదటి ప్రత్యక్ష ఎన్నికలు. బోణీలో బోల్తాపడిన హైఫై నాయకుడిగా ముద్రపడిపోయాడు. దీంతో... ఆయన చాంబర్ తీసుకుంటే తమకు కూడా కలిసిరాదేమో అని ఇప్పుడు జగన్ మంత్రివర్గంలోని సభ్యులు అనుకుంటున్నారట. ఆ చాంబరును ఎవరికి ఇవ్వజూపినా కాదనడంతో చివరికి తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షానికి కేటాయించారు.

నిజానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన తరువాత అంత ప్రాధాన్యం ఉన్నది లోకేశ్‌కే కావడంతో ఆయన చాంబర్‌ను విశాలంగా - సకల సదుపాయలతో కట్టించారు. కానీ.. ప్రస్తుత మంత్రులు మాత్రం ఏ సదుపాయాలుంటే ఏం గెలుపు యోగం లేకపోతే కష్టమే అంటూ నో చెప్పేశారట.

దీంతో ఈ ఛాంబర్ ను ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఛాంబర్ గా ఇచ్చేసింది. మాజీ డిప్యూటీ స్పీకర్ ఛాంబర్ ను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి ఇచ్చింది. రెండు ఛాంబర్లు పక్కపక్కనే ఉండటంతో తెలుగుదేశం నేతలూ ఖుషీ అయిపోయారట.


Tags:    

Similar News