ఎంపీ ఫోన్ పోయింద‌ని.. మ‌హిళ ఇంటిలో పోలీసుల‌ వీరంగం!

Update: 2022-07-06 05:48 GMT
రాజ‌మండ్రి వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవ‌ల కాలం వ‌ర‌కు త‌న పార్టీకే చెందిన రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజాతో ఉప్పూనిప్పుగా వ్య‌వ‌హరించారు. ఒకరికొక‌రు బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు కూడా చేసుకున్నారు. ఈ విష‌యంలో సీఎం వైఎస్ జ‌గ‌న్.. ఎంపీ మార్గాని భ‌ర‌త్ కు బాగా త‌లంటార‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి.

కాగా ఇప్పుడు మ‌రోసారి మార్గాని భ‌ర‌త్ వ్య‌వ‌హారం మ‌రోమారు క‌ల‌క‌లం రేపుతోంది. త‌న ఫోన్ పోయిందంటూ ఒక మ‌హిళ ఇంటిని పోలీసుల‌తో చింద‌ర‌వంద‌ర చేయించారు. ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళ్తే.. రాజ‌మండ్రి విమానాశ్ర‌యంలో గాదాల‌కు చెందిన మ‌హిళా పారిశ్రామిక‌వేత్త శిరీష.. ఎంపీ మార్గానిని క‌ల‌సి మాట్లాడారు.

ఆ త‌ర్వాత ఆమె వెళ్లిపోయారు. ఈ క్ర‌మంలో ఎంపీ మార్గాని భ‌ర‌త్ ఫోన్ పోయింది. త‌న ఫోన్ మిస్సింగ్ పై ఆయ‌న శిరీష‌పై అనుమానం వ్య‌క్తం చేశారు. ఇదే విష‌యాన్ని పోలీసుల‌కు తెలిపారు. దీంతో వారు శివాలెత్తిన‌ట్టు రెచ్చిపోయార‌ని శిరీష ఆరోపిస్తున్నారు.

ఫోన్ కోసం మ‌హిళ ఇంటికి వ‌చ్చిన కోరుకొండ పోలీసులు ఆమె ఇంటిలో వ‌స్తువుల‌న్నింటినీ కింద‌ప‌డేసి చింద‌ర‌వంద‌ర చేశారు. త‌నతో అనుచితంగా ప్ర‌వ‌ర్తించార‌ని శిరీష ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ ఫోన్ సంగ‌తి ఏంటో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని.. ఫోన్ ఎక్క‌డంటూ దుర్భాష‌లాడారని వాపోయారు.

త‌న ఇంటికొచ్చే ముందు పోలీసులు త‌న‌కు ఫోన్ చేసి ఎంపీ ఫోన్ గురించి ప్ర‌శ్నించార‌ని తెలిపారు. త‌న‌కు తెలియ‌ద‌న్నా వినిపించుకోకుండా ఇంటికి వ‌చ్చి త‌న వ‌స్తువుల‌న్నింటినీ చింద‌ర‌వందర చేశార‌ని చెప్పారు. బెడ్ రూమ్ లోని సామాన్లు అన్నింటినీ కింద‌ప‌డేసి ర‌చ్చ‌రచ్చ చేశార‌ని వాపోయారు. చివ‌ర‌కు కిటీల‌ను కూడా వ‌దిలిపెట్ట‌కుండా ప‌గుల‌కొట్టార‌ని ఆమె ఆరోపించారు. కావాలంటే విమానాశ్ర‌యంలో సీసీ కెమెరాల‌ను చెక్ చేయాల‌ని ఆమె సూచిస్తున్నారు.

దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఫోన్ పోయిందంటూ పోలీసులు ఎంపీ అనుచ‌రులు మ‌హిళ‌పై దౌర్జ‌న్యానికి పాల్ప‌డ‌టం ఏమిట‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. మ‌రోవైపు పోలీసుల తీరుపై ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి (సీఎంవో) శిరీష ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో వేధించి, ఇంట్లో అమర్యాదగా వ్యవహరించారంటూ కోరుకొండ పోలీసులపై ఆరోప‌ణ‌లు చేశారు.
Tags:    

Similar News